Telangana | ఖమ్మం రూరల్ : రెండు మూగజీవాలు సచ్చేలా పోట్లాడుకోవడం చూసి అయ్యో అని చలించడమే ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పశువుల గొడవను ఆపేందుకు మధ్యలో వెళ్తే కొమ్ములతో దాడి చేసి చంపేశాయి. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామంలో చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని ముత్తగూడెం గ్రామానికి చెందిన రామకృష్ణ (34) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం పని నిమిత్తం ఖమ్మం నగరానికి వెళ్లిన రామకృష్ణ సాయంత్రానికి స్వగ్రామానికి తిరిగి బయల్దేరాడు. ముత్తగూడెం సమీపానికి రాగానే రెండు పశువులు రహదారిపై పోట్లాడుకోవడం రామకృష్ణ గమనించాడు. ఎలాగైనా వాటి గొడవను ఆపాలని అనుకున్నాడు. దీంతో తన బైక్‌ను రోడ్డు పక్కన నిలిపి ఆ పశువులను అదిలించాడు. కానీ అప్పటికే ఆవేశంతో ఉన్న పశువుల్లో ఒకటి తన కొమ్ములతో రామకృష్ణపై దాడి చేసింది. కొమ్ము బలంగా శరీరంలోకి దిగడంతో తీవ్రగాయాలైన రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు రామకృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. పని మీద వెళ్లొస్తానని చెప్పినోడు.. ఇలా శవంగా మారడం చూసిన కుటుంబీకులు గుండెలు పగిలేలా ఏడవడం అక్కడ ఉన్నవారందరినీ కన్నీరు పెట్టించింది. కాగా, మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.