శాయంపేట, సెప్టెంబర్ 28 : బీటెక్ పూర్తి చేసి రెండేళ్లయినా ఉద్యోగం రావడంలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నర్సింహులపల్లిలో జరిగింది. ఎస్సై పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపల్లికి చెందిన రైతు ముసుకు మల్లయ్య కుమారుడు హరీశ్(26) రెండు సంవత్సరాల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో మనస్తాపానికి గురైన హరీశ్ ఈ నెల 24న సాయంత్రం ఇంట్లో ఉన్న గడ్డి మందు తీసుకుని వరంగల్‌కు వెళ్లాడు. అకడి నుంచి తండ్రికి ఫోన్ చేసి ఉద్యోగం రాకపోవడంతో గడ్డి మందు తాగానని చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు వరంగల్‌కు వెళ్లి హరీశ్‌ను పరకాల దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పరమేశ్ తెలిపారు.