అమీన్పూర్, డిసెంబర్ 10: కూతురును ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని అమ్మాయి తల్లిదండ్రులు కొట్టి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..ఏపీలోని కృష్ణాజిల్లా, పెనుగంచిప్రోలుకు చెందిన కాకాణి జ్యోతిశ్రావణ్సాయి (19) మైసమ్మగూడ సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్నసంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ ఇసుకబావికి చెందిన తమరుపల్లి శ్రీజ, సాయి ప్రేమించుకున్నారు. ఈనెల 9న శ్రీజ ఇంటికి శ్రావణ్సాయి రావడం చూసిన అమ్మాయి తల్లిదండ్రులు ఆగ్రహంతో బ్యాట్‌తో కూతురితోపాటు శ్రావణ్సాయిపై దాడిచేశారు. ఈ ఘటనలో గాయపడిని కూతురును దవాఖానకు తరలించి, సాయిని మాత్రం అక్కడే వదిలేశారు. సాయిని నిజాంపేట్‌లోని ఓ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమిం చి బుధవారం సాయి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.