హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : యువ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి (37) సోమవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దెలచెరువు గ్రామానికి చెందిన దత్తురెడ్డి 2015 నుంచి ఈనాడు పత్రికలో పనిచేస్తున్నారు. గతంలో హైదరాబాద్, నల్లగొండలో పనిచేసిన ఆయన, గతేడాది సెప్టెంబర్‌లో వరంగల్‌కు బదిలీ అయ్యారు. వివిధ అంశాలపై అనేక పరిశోధనాత్మక కథనాలు రాశారు. ఆయనకు భార్య, ఆరేండ్ల కుమారుడు ఉన్నారు. దత్తురెడ్డి అకాల మరణంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆయన చిన్నతనంలోనే మృతిచెందడం కలిచివేసిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దత్తురెడ్డి హఠాన్మరణంపై కేటీఆర్ సంతా పం ప్రకటించారు. చిన్నవయసులో నే ఆయన మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు. దత్తురెడ్డి మృతి విచారకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన మిషన్ కాకతీయపై రాసిన అనేక కథనాలను గుర్తుచేశారు. ఎంపీ వద్దిరాజు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దత్తురెడ్డి మృతికి సంతాపం తెలిపారు.