నందిగామ, ఆగస్టు 20: విద్యుత్తు షాక్‌తో యువ రైతు మరణించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్‌లో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన జిల్లెల మురళి(34) తన పొలంలో డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసుకొని నడుపుతున్నాడు. అందులో పశువుల దాణా యంత్రం పనిచేయకపోవడంతో కరెంట్ సమస్య ఉన్నదని గుర్తించాడు.
వెంటనే ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో రంగాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లోవోల్టేజీ సమస్యతో విద్యుత్తు మోటర్లు కాలిపోతున్నాయని, అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడ్డారు. మురళి మృతికి విద్యుత్తు శాఖతోపాటు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.