Jagadish Reddy | ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎన్నో దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చామని.. ఈ సస్పెన్షన్ తనను ఏమాత్రం భయపెట్టలేదని సూర్యాపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యులతో కలిసి అంబేద్కర్ భారీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో.. శాసనసభలో ఏం జరుగుతుందో ప్రజలంతా చూశారు. మేం మాట్లాడుతున్న సందర్భంలో దురదృష్టవశాత్తు.. శాసనసభలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడుతున్న దాన్ని లైవ్ కూడా ఇవ్వడం లేదని ప్రజలు మాకు చెబుతున్నరు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం నిజాలు దాచిపెడుతామనుకుంటే సాధ్యం కాదు’ అన్నారు.
‘శాసనసభలో ఒక్కరోజు కూడా అన్‌పార్లమెంటరీ వర్డ్ కానీ, ఇతరులను కించపరిచేవిధంగా, శాసనసభ హుందా తనాన్ని తగ్గించే విధంగా కానీ నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రత్యేకించి చైర్‌కు సంబంధించి.. స్పీకర్ అధికారాలు ఏందో.. స్పీకర్ విధులు ఏంటో అన్నీ నాకు తెలుసు. ఎక్కడా కూడా స్పీకర్ గౌరవానికి భంగం కలిగించే పద్ధతుల్లో మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్యకు స్పీకర్ సమ్మతిస్తరని నేను అనుకోవడం లేదు. ఎంత దురదృష్టకరమంటే.. జరిగింది చర్చ నాకు, కాంగ్రెస్ పార్టీకి మధ్యన. స్పీకర్ పెద్దమనిషిగా.. రెఫరీగా ఉంటారు కాబట్టి.. ఆయనను పదేపదే రిక్వెస్ట్ చేశాను. కాంగ్రెస్ సభ్యులు ఇద్దరు 1.20గంటలు మాట్లాడారు. అప్పుడు మా సభ్యులు అభ్యంతరం తెలుపలేదు.. వారు సాఫీగా మాట్లాడుకున్నరు’ అని తెలిపారు.
‘స్పీకర్ నాకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ తరఫున మాట్లాడేందుకు కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు. నేను దానికి సంబంధించి రాత్రి జిల్లాలోని రైతులు, అన్నివర్గాల ప్రజలతోని మాట్లాడాను. వాళ్ల సమస్యలను ఎలా ప్రతిబింబించాలి.. రాష్ట్రంలో ఎండిపోతున్న పొలాలు, అక్కడ రైతులు చెబుతున్న బాధలు.. వివిధ వర్గాల ప్రజలు ఎలా మోసపోయోమని చెబుతున్నరో.. వాటన్నింటిని శాసనసభలో మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశాను. అందులో ఎక్కడా ఒక్క తప్పుమాట, పొరపాటు మాట.. స్పీకర్‌ను కించపరిచే మాట లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది. ప్రభుత్వం బట్టలు విప్పే మాట ఉంది.. ఉండి తీరుతుంది ’ అన్నారు.
‘ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజలు ఇంకా ఆక్రోషంగా ఉన్నారు. ప్రజల భాష వింటే.. ఈ ముఖ్యమంత్రి, మంత్రులుగానీ పదవుల్లో ఒక్క నిమిషం ఉండకూడదు. బహుషా ఏ పరిపాలకుడు పడి తిట్లు పడుతున్నరు. అయినా సిగ్గు లేకుండా ఉంటున్నరు. సస్పెన్షన్ అనేది భయపెట్టించేది కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినం. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి నియంత్రత్వాలను ఎదుర్కొని వచ్చినం. కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలినం. ఇవేవీ మమ్మల్ని ఆపలేవు. మా గొంతు నొక్కలేవు. ఇంకా బలంగా గొంతును వినిపిస్తాం. ఒక శాసనసభలో ఆపినంత మాత్రానా.. ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు’ అని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.