HCU | హెచ్‌సీయూలో ఉద్రిక్త పరిస్థితులపై ఇప్పటికైనా స్పందించాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పశ్చిమ హైదరాబాద్‌కు ఆక్సిజన్ అందించే 400 ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తూ గ్రీన్ మర్డర్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలతో ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలను తిప్పుతున్నదని అన్నారు. వాటిని చూసి అక్కడి నెమళ్లు సాయం కోసం అర్థించడం వినిపిస్తుందని అన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా ఈ వివాదంపై మాట్లాడకపోతే ఎలా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు, వీడియోలను కేటీఆర్ ట్విట్టర్(ఎక్స్)లో పంచుకున్నారు.
This is brazen green murder by destroying 400 acres of precious lung space in western Hyderabad
You can hear the peacocks crying for help as the bulldozers and JCBs of the Congress Govt rummage
If you don’t speak up now, it’s on you Mr @RahulGandhi #SaveHCUBioDiversity pic.twitter.com/iPxnhSgAdv
— KTR (@KTRBRS) March 31, 2025
హెచ్‌సీయూ వివాదమేంటంటే..
కంచె గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ సమీపంలో ఉన్న 400 ఎకరాల భూమిని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మేయాలని ఇటీవల నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని చదును చేసేందుకు వచ్చిన అధికారులను హెచ్‌సీయూ విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ 400 ఎకరాల భూమి తమ యూనివర్సిటీకే చెందుతుందని విద్యార్థులు చెప్పుకొచ్చారు. అయితే ఆ భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ తాజాగా స్పష్టం చేసింది. ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా ప్రభుత్వం నిరూపించుకుందని తెలిపింది. ప్రైవేటు సంస్థకు 21 ఏండ్ల క్రితం కేటాయించిన భూమిని దక్కించికుందని పేర్కొంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవన్నారు. సర్వేలో ఒక అంగుళం భూమి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలిందని చెప్పింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక ఇక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని స్పష్టం చేసింది.
కాగా, టీజీఐఐసీ ప్రకటనను హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఖండించారు. 2024 జూలై అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు భూమి ఎలా ఉందనే దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని వివరించారు. భూ హద్దులను హెచ్‌సీయూ అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని రిజిస్ట్రార్ తెలిపారు. ఇప్పటివరకు భూమి సరిహద్దులను గుర్తించలేదని తెలిపారు. దీనిపై హెచ్‌సీయూకి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఆ భూమిని వర్సిటీకే ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నామని పేర్కొన్నారు. భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు.