గజ్వేల్, ఫిబ్రవరి 5: కాంగ్రెస్, బీజేపీలు తమ పాలనలో 103 సార్లు రాజ్యాంగాన్ని సవరించాయని.. రాజ్యాంగ ప్రవేశికలోనూ కాంగ్రెస్ మార్పులు చేసిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీల చరిత్ర తెలుసుకోకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రసంగం వినని వాళ్లు సైతం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం గజ్వేల్‌లోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో వంటేరు మీడియాతో మాట్లాడారు. 1956 నుంచి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమకు అవసరమైనప్పుడల్లా రాజ్యాంగాన్ని మార్చాయని గుర్తుచేశారు. రాష్ర్టాలపై పెత్తనం చెలాయించేందుకు అనుకూలం గా మార్పులు చేసుకొన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ ఠాణాలో ఫిర్యాదు చేసే ముం దు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ చరిత్రను తెలుసుకొని ఉంటే బాగుండేదని హితవుపలికారు.
రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్సే
రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గజ్వేల్ ప్రాంతంలో పెండ్లికి వచ్చి పెట్టింది తిని వెళ్లకుండా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమేమిటని రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. గతంలో చంద్రబాబుతో ఉండి ఎన్టీఆర్‌భవన్‌కు తాళం వేయించాడని, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉండి గాంధీభవన్‌కు తాళం వేయించేటట్టు వ్యవహరిస్తున్నాడని రేవంత్‌ను ఉద్దేశించి ఎద్దేవాచేశారు. బీజేపీ కూడా రాజ్యాంగాన్ని మార్చాలని చూసిందని, వాజపేయి అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగాన్ని మార్చడానికి కమిటీ కూడా వేశారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని ఆసరాగా చేసుకుని వారి అవసరాలను తీర్చుకొనేందుకు ఎలక్షన్ కమిషన్, సీబీఐ వంటి సంస్థలను తమ చేతిలోకి తీసుకొంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దెదించినట్టుగానే ప్రస్తుతం తెలంగాణ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. దశాబ్దాల కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశప్రజలు దారిద్య్రరేఖకు దిగువనే జీవిస్తున్నారని ఉద్ఘాటించారు. దేశ పరిస్థితులను మార్చడానికి కేసీఆరే సరైన నాయకుడని స్పష్టం చేశారు.