రవీంద్రభారతి, నవంబర్ 11: రాష్ట్రంలోని ఎరుకల కులస్థులు బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించారు. కారు గుర్తుకు ఓటేస్తామని, కేసీఆర్‌నే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు తెలంగాణ ఎరుకల సంఘం (కురు) రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎరుకల జాతి మొత్తం ఓట్లు వేసి గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని ఎరుకల సంఘం (కురు) రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు పిలుపునిచ్చారు.
శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కుర్రా సత్యానారాయణ మాట్లాడుతూ.. ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ ఎరుకల జాతిని పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎరుకల జాతి ఆత్మగౌరవ భవనం కోసం ఎకరం భూమితోపాటు నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారని చెప్పారు. పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న 50 వేల ఎరుకల కుటుంబాల అభివృద్ధికి తొలిసారిగా ఎరుకల ఎంపవర్మెంట్ పథకం ప్రవేశపెట్టి రూ.60 కోట్ల నిధులు కేటాయించిందని కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. కుల దేవత ఎరుకల నాంచారమ్మ జాతర కోసం ఏటా ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నదని గుర్తుచేశారు. ఎమ్మెల్సీగా కూడా తనకు కేసీఆర్ అవకాశం కల్పించారని సత్యనారాయణ గుర్తుచేశారు. సమావేశంలో నాయకులు కుతాడి రవికుమార్, గోపాల్, నాగులు, పీ నాగులు, పోచయ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు శ్యామల, రాణేమ్మ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రస్తాపురం సత్యనారాయణ పాల్గొన్నారు.