పెద్దపల్లి, ఏప్రిల్ 17: మక్కజొన్న కంకులు సాధారణంగా పసుపు రంగులో ఉంటాయి. స్ట్రాబెర్రీ పండులా ఎరుపు రంగులో ఉండే మక్కజొన్న కంకులు మీరు ఎప్పుడైనా చూశారా? పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ మక్కజొన్న పండిస్తున్నాడు ఓ యువ రైతు. పెద్దపల్లికి చెందిన శ్రవణ్ ఎంటెక్ చదివి రక్షణశాఖ ప్రయోగశాలలో ప్రైవేట్ ఇంజినీర్‌గా పనిచేశాడు.
వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగాన్ని వదిలి సాగుపై దృష్టిపెట్టాడు. సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లోని తన పొలంలో సేంద్రియ పద్ధతిలో తీరొక్క పండ్ల మొక్కలను పెంచుతున్నాడు. రూ.600 చెల్లించి ఆన్లైన్లో స్ట్రాబెర్రీ మక్కజొన్న విత్తనాలు తెప్పించి నాటగా, నాలుగు మొక్కలు మొలకెత్తాయి. 90 రోజులకు స్ట్రాబెర్రీ మక్క కంకి కోతకు వచ్చింది. మొదట కంకి తెల్లగా తర్వాత స్ట్రాబెర్రీ పండు రంగులోకి మారిందని శ్రావణ్ తెలిపాడు. ఈ సాగు విధానాన్ని తెలుసుకోవడానికి స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు.