సింగరేణిలో మళ్లీ పాత రోజులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న యాజమాన్యం ఇప్పుడు మరో కార్మిక వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఎల్లో, రెడ్ కార్డ్ మెసేజ్‌లతో సింగరేణి కార్మికులపై వేధింపులకు దిగుతున్నది.
Singareni | జయశంకర్ భూపాలపల్లి, జూలై 11 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో యాజమాన్యం మరో నల్లచట్టం తీసుకొచ్చింది. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండానే దానిని అమలు చేసింది. ఎల్లో, రెడ్ కార్డుల పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త సర్క్యులర్‌తో కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. గనిలో కార్మికుడు తప్పు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా మొదట ఎల్లో కార్డు పేరుతో కార్మికుడి సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపిస్తారు. ఇలా రెండు మూడు సార్లు ఎల్లో కార్డు మెసేజ్ తర్వాత రెడ్ కార్డ్ మెసేజ్ వస్తుంది.
అనంతరం కార్మికుడిపై చర్యలకు సిద్ధం చేస్తారు. ఇక కార్మికుడు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఉండదు. ఉత్పత్తి, ఉత్పాదకతే లక్ష్యంగా సింగరేణి సంస్థ ముందుకుసాగుతూ.. కార్మికులపై నల్ల చట్టాలను అమలు చేస్తూ మానసికంగా హింసిస్తున్నదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా యాజమాన్యం అమలు చేస్తున్న నూతన సర్క్యులర్‌తో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. భూపాలపల్లి ఏరియాలో ఒక్క నెలలోనే 34 మందికి రెడ్, ఎల్లో కార్డులు జారీ చేశారంటే.. సింగరేణి వ్యాప్తంగా ఎంతమందికి జారీ చేసి ఉంటారో అవగతమవుతున్నది.
గనుల్లో ఏవైనా ప్రమాదాలు, తప్పులు జరిగితే.. అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు ఇకపై విచారణలుండవు. కొత్త సర్క్యులర్ ప్రకారం ఎల్లో కార్డు, అనంతరం రెడ్ కార్డులు జారీ చేసి చర్యలు తీసుకోవడమే ఉంటుంది. సదరు కార్మికుడు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఉండదు. సెల్‌ఫోన్‌కు ఎల్లో, రెడ్ కార్డు మెసేజ్ వస్తే.. శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. గతంలో కార్మికుడు గనిలో తప్పు చేస్తే విచారణ జరిపి తప్పు చేసినట్టు నిరూపణ అయితే చార్జిషీట్ ఇవ్వడం లేక మరో చర్య తీసుకునే వారు.
డీజీఎంఎస్ విచారణలు కూడా జరిగేవి. ఇలాంటి విచారణలకు యాజమాన్యం స్వస్తి పలికింది. సింగరేణిలో పని చేసే కార్మికుల్లో నిరుద్యోగులే. సెల్ఫోన్లలో మెసేజ్‌లు చదువుకోవడం రాక, అక్షరాస్యులైతే ఒక్కోసారి చూసుకోలేకపోతే యాజమాన్యం చర్యలు తీసుకునే వరకు కార్మికుడికి తెలియని పరిస్థితి నెలకొంది. పనిస్థలాల్లో సరైన సౌకర్యాలు కల్పించకుండా, రక్షణ పరికరాలు అందించకుండా తప్పుచేసిన కార్మికుడిపై ఎల్లో, రెడ్ కార్డులు తీసుకురావడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. కార్మికులకు సక్రమంగా బూట్లు, హెల్మెట్లు తదితర రక్షణ పరికరాలు అందించడం లేదని, కాలం చెల్లిన యంత్రాలతో పనులు చేయిస్తున్నారని, ఇలాంటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయి? దీనికి కార్మికుడిని బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నాయి.
అధికారుల ప్రమోషన్లు, ఆర్థిక ప్రయోజనాల కోసం కార్మికులను బలిపశువులను చేస్తున్నారు. రెడ్ కార్డు అందుకున్న ఉద్యోగికి చార్జిషీట్‌తోపాటు సస్పెన్షన్, ఇంక్రిమెంట్ కోత, డిస్మిస్ వంటి తీవ్రమైన క్రమశిక్షణ చర్యలకు యాజమాన్యం సిద్ధమవుతున్నది. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. వెంటనే ఎల్లో, రెడ్ కార్డు విధానాన్ని రద్దు చేయాలి. లేకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం
-మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
కార్మికుడు, అధికారి తప్పులు చేస్తే స్టాండింగ్ ఆర్డర్స్, మైన్స్ యాక్టులు, డీజీఎంఎస్ విచారణలు అనేకమున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎల్లో, రెడ్ కార్డులు ఏంటీ? ఇదేమైనా ఫుట్‌బాల్, హాకీ గేమ్‌లా? తమాషాగా ఉందా? తప్పు జరిగితే చార్జిషీట్ ఇవ్వాలి. ప్రిమిలినరీ విచారణ జరపాలి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ చేతగానితనం వల్లే యాజమాన్యం ఇలాంటి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నది. వెంటనే ఈ సిస్టం ఆపాలి. ఈ విషయమై సింగరేణి సీఎండీకి లేఖ రాసిన.
-రియాజ్ అహ్మద్,హెచ్ఎంఎస్ ప్రధానకార్యదర్శి