న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఏపీలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఈ నెల 22న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు మన్యం జగదీశ్, వెంకటసుబ్బారావు, వినోద్‌కుమార్, హరిబాబు, ఆంజనేయులు, అమితాబ్, గెల్లిపోగు రాజు దాఖలు చేసుకున్న పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. 48 గంటల్లోగా పిటిషనర్లు తమ పాస్‌పోర్టులను దర్యాప్తు అధికారులకు సరెండర్ చేయాలని ఆదేశించింది. కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని, దర్యాప్తు అధికారులు పిలిచినప్పుడు హాజరుకావాలని వారికి స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.