హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): యాసంగి రైతుబంధు పంపిణీలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. రైతుల ఖాతాల్లో జమచేసిన రైతుబంధు పైసలు మళ్లీ వెనక్కి వెళ్తున్నాయి. రైతుల ఖాతాల నుంచి తిరిగి సర్కారు ఖాతాలో జమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది రైతుల ఖాతాల నుంచి రైతుబంధు డబ్బులు మళ్లీ వెనక్కి వెళ్తున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు.
ఐదెకరాల వరకు రైతుబంధు వేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తమకు ఇంకా రాలేదంటూ రెండు, మూడెకరాల రైతులు మొత్తుకుంటున్నదని అందుకేనని తెలిసింది. ‘రైతుబంధు’ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలకు స్పందించిన ప్రభుత్వం రైతుబంధు పైసలను జమచేశామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులందరికీ జమ కాలేదన్న విషయం తాజాగా వెల్లడైంది.
30 వేల మంది రైతుల పైసలు రిటర్న్
రైతుబంధు పంపిణీలో వ్యవసాయశాఖ నిర్లక్ష్యం కారణంగా వేలాదిమంది రైతులు పెట్టుబడి సాయానికి దూరమయ్యారన్న విమర్శలున్నాయి. ప్రతి జిల్లాలో 500 నుంచి 1000 మంది రైతుల పైసలు తిరిగి సర్కారు ఖాతాల్లో జమ అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల నుంచి 30 వేల మంది రైతుల పైసలు వెనక్కి వెళ్లినట్టు సమాచారం. తమకు రైతుబంధు పైసలు జమకాలేదని అధికారులను రైతులు ప్రశ్నిస్తే ‘ఎప్పుడో జమ అయినట్టు’ అధికారులు చెప్తున్నారు. బ్యాంకులో అడితే రైతుబంధు పైసలు పడలేదని చెప్తున్నారని రైతులు వాపోతున్నారు.
వ్యవసాయశాఖ నిర్లక్ష్యం
వ్యవసాయశాఖ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. జమచేసిన రైతుబంధు పైసలు వెనక్కి రావడానికి బ్యాంకు ఖాతాల సమస్యే కారణమని గుర్తించినట్టు సమాచారం. కేవైసీ చేయించకపోవడం, రుణమాఫీ కాకపోవడం, రైతులు తమ ఖాతాలను మూసివేయడం, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారడం వంటి కారణాలతో సమస్య ఏర్పడినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. రైతుబంధు జమచేయడానికి ముందే ఈ సమస్యలను గుర్తించి ఉంటే ఇప్పుడీ గందరగోళం ఏర్పడి ఉండేది కాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మార్చి 28వ తేదీ నాటికి 64.75 లక్షల మంది రైతులకు రైతుబంధు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో సమస్యలున్న రైతుబ్యాంకు ఖాతాల్లోనూ డబ్బులు జమ అయ్యాయి. సమస్య ఏర్పడి నెల రోజులు దాటినా సమస్యను పరిష్కరించి డబ్బులు తిరిగి పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదెకరాల వరకు రైతుబంధు వేయడానికే నాలుగు నెలల సమయం తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు రివర్స్ వచ్చిన డబ్బులను వెనక్కి ఇచ్చేందుకు ఎంత సమయం తీసుకుంటోందనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వేశామన్న సర్కారు.. రాలేదన్న రైతులు
రైతుబంధు విషయంలో ప్రభుత్వం చెప్తున్నదానికి, రైతులు చెప్తున్న దానికి మధ్య పొంతన కుదరడం లేదు. మార్చి 28 నాటికే ఐదెకరాల వరకు (64.47) రైతుబంధు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రెండు, మూడు, నాలుగు ఎకరాల రైతులు కూడా తమకు ఇంకా పెట్టుబడి సాయం అందలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరో వారం రోజులు గడిస్తే రైతుబంధు పంపిణీ ప్రారంభించి ఐదు నెలలు పూర్తవుతుంది. అయినా ఇప్పటికీ ఇంకా 6 లక్షల మంది రైతులకు పంపిణీ చేయాల్సి ఉన్నది.