Telangana | కరీంనగర్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో వేసవికి ముందే యాసంగి పంటలు ఎండుతున్నాయి. కాలువల ద్వారా నీళ్లు రాక, బావులు, బోర్లలో నీళ్లు లేక సాగునీటి కోసం రైతుల కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో పూడిక తీసుకుంటూ, కొత్త బోర్లు వేయిస్తూ ఇప్పటి నుంచే సాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా రైతులకు గత యాసంగి సీజన్ నుంచి ఈ కష్టాలు తప్పడం లేదు. నిరుడు యాసంగిలో గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలో సకాలంలో నీటిని విడుదల చేయని కారణంగా ర్యాలపల్లి, నారాయణపూర్ తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ కింద ఉన్న చివరి ఆయకట్టుకు నీళ్లందక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత అనుభవాలతోనైనా మేల్కొని ప్రభుత్వం సరైన రీతిలో నీటి నిర్వహణ చేపడుతుందని భావించిన రైతులకు.. ఈ సారి కూడా నిరాశే మిగిలింది. జిల్లా కేంద్రానికి అతి చేరువలో ఉన్న చామన్‌పల్లి, ఎలబోతారం, నల్లగుంటపల్లి, ముగ్ధుంపూర్ తదితర గ్రామాల్లో కాలువ నీళ్లందక పంటలు ఎండుతున్నాయి. చామన్‌పల్లి గ్రామానికి వచ్చే 11- ఆర్ కాలువకు సరిపడా నీళ్లు వదలకపోవడంతో చివరి పొలాలకు అందడం లేదు. ఈ కాలువ కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉండగా.. కాలువలో పారుతున్న నీరు 50 ఎకరాలకు కూడా సరిపోవడం లేదు.
చామన్‌పల్లికి చెందిన రైతు బోగొండ రాజు బావి నీళ్లతో గతేడాది మూడెకరాల్లో వరి, ఎకరంలో మక్కజొన్న సాగు చేశారు. సాగు నీరు అందక ఇబ్బంది పడ్డారు. ఆ అనుభవంతో ఈ సారి మూడెకరాల్లో మక్కజొన్న, ఎకరంలో వరి సాగుచేశారు. బావి పూర్తిగా ఎత్తివేయడంతో రూ.2 లక్షలు ఖర్చు చేసి బోరు వేయించుకున్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో బోరు ద్వారా ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదు. నీళ్లు లేక మక్క పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వరి పొలం కూడా ఎండిపోయింది. మహిళా రైతు బోగొండ లక్ష్మి సాగు చేసిన 3.20 ఎకరాల మక్క పంటను పశువులకు వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కాలువ చివరి ఆయకట్టు రైతులందరిది ఇదే పరిస్థితి.
కరీంనగర్ జిల్లాలో గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ కనిపించలేదు. కేసీఆర్ పాలనలో నిండు వేసవిలోనూ చెరువులన్నీ మత్తళ్లు దుంకేవి. కానీ, ఇప్పుడు వేసవి సమీపించకముందే పంటలు మాడిపోతున్నాయి. ఇంకా రెండు నెలల పాటు పంటలకు నీటి తడులు అవసరం. దీంతో ఏం చేయాలో పాలుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్ మండలంలోని చామన్‌పల్లి, ముగ్ధుంపూర్, నల్లగుంటపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రామన్నపేట, దేవునిమిట్ల, ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లి, సిరికొండ, పెద్ద లింగాపూర్, ఒగులాపూర్ తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇక గంగాధర మండలంలోని నారాయణపూర్, మిడ్‌మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ల ఆయకట్టు మండలాలు గన్నేరువరం, చిగురుమామిడి, సైదాపూర్, తిమ్మాపూర్‌లో మరికొన్ని రోజుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పర్యవేక్షించి కాలువల ద్వారా సరిపడా నీళ్లు ఇవ్వాలని, చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.