అహో ప్రకృతి వైచిత్య్రం దుర్లభం శ్రీమతామపి మన్యేత్ర వన సౌందర్యం ఛాత్రా కిం నిర్మితం స్వయమ్
‘ఆహా ఏమిటి ప్రకృతి వైచిత్య్రము. ఎంతటి శ్రీమంతులకైనా దుర్లభమైనది – ఈ వన సౌందర్యాన్ని బ్రహ్మ ఏకాగ్రముగా ఆలోచించి సృష్టించినాడా’ అని యాద మహారుషి ఈ పర్వత ఆవరణలోని వన సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా చుట్టూరా ప్రాంతాలలో పర్యాటకాభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. యాదాద్రి మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పర్యాటక కేంద్రాలతో విలసిల్లబోతున్నది. వివిధ జిల్లాల నుంచి ఆలయానికి సులభంగా చేరుకోవడానికి రహదారి విస్తరణ పనులతో పాటు రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టారు. వాహనాల వల్ల కాలుష్యమయం కాకుండా రకరకాల మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటుతున్నారు. ఒకప్పుడు యాదాద్రి దట్టమైన అరణ్యాల మధ్య ఉండేది. పురాణాల్లో ఈ వర్ణనలు కడు రమ్యంగా ఉంటాయి. ముఖ్యమంత్రి సమ్యక్ దృష్టితో యాదాద్రినే కాకుండా, ఆ పరిసరాలను అభివృద్ధి చేస్తున్నారు. అరణ్యాలనే కాకుండా ఆలయ నగరంలో ఎక్కడ ఏ కొంచెం ఖాళీ స్థలమున్నా అక్కడ మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇప్పటి వరకు యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) ఆలయాభివృద్ధి కోసం రూ.850 కోట్లు ఖర్చు చేస్తే అందులో రూ.12.30 కోట్లు పచ్చదనం కోసమే వెచ్చించడం గమనార్హం. రాయగిరి నుంచి ఆలయం వరకు ఆరు కిలోమీటర్ల రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు.
రాయగిరి దగ్గర యాదాద్రికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన రెండు అర్బన్ పార్కులను ఏర్పాటు చేశారు. ఈ పార్కులకు నరసింహ అరణ్యం, ఆంజనేయ ఆరణ్యాలుగా నామకరణం చేశారు. రాయగిరి- 1 రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 56.68 హెక్టార్లలో ఏర్పాటు చేసిన ఆంజనేయ అరణ్యంలో 2015 – 2016 నుంచి నేటి వరకు 40,770 మొక్కలను నాటారు. ఈ ప్రాంతం దట్టమైన అడవిని తలపిస్తున్నది. దీంతో పాటు రాయగిరి-2 రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 96.12 హెక్టార్లలో ఏర్పాటు చేసిన నరసింహ అరణ్యంలో 2017- 2018 నుంచి 17, 634 మొక్కలను నాటారు. అడవిలోనే తీర్చిదిద్దిన ఈ పార్కులు పిల్లలనే కాదు పెద్దలనూ ఎంతగానో ఆకట్టుకొంటున్నాయి. రకరకాల చెట్లు, పూల మొక్కలు, నీటితో కళకళ లాడే చెక్ డ్యాంలు, వాకింగ్ ట్రాక్‌లను నిర్మించారు. అరణ్యంలో మొత్తం 5 జింకలను వదలగా, ప్రస్తుతం 11 జింకలు వృద్ధి చెందాయి. సుమారు రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ రెండు పార్కులు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. మియావాకి పద్ధతిలో వృద్ధి చేస్తున్న ఈ అడవిని మొత్తం రాష్ర్టానికే ఆదర్శంగా తీసుకొంటున్నారు. అధ్యయన వేత్తలు దీనినొక కేస్ స్టడీగా తీసుకొని పరిశోధన సాగిస్తున్నారు.
యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఆధ్యాత్మికతోపాటు మానసిక ఉల్లాసం కలిగించేలా లక్ష్మి తటాకం (గండి చెరువు) పరిసర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతమంతా పూర్తిగా పచ్చదనంతో కళకళలాడనున్నది. 21.17 ఎకరాల మేర గోదావరి జలాలు నింపేందుకు పనులు సాగుతున్నాయి. ఇందుకోసం రూ.33.69 కోట్ల నిధులను కేటాయించగా, రూ.20.10 కోట్లతో గండిచెరువు పూడికతీత, రక్షణగోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వర్షాలు వస్తే వరదనీళ్లన్నీ లక్ష్మి తటాకంలోకి చేరకుండా చెరువు చుట్టూ ప్రత్యేకమైన పైపులైన్లు వేస్తున్నారు. ఆ పక్కనే భక్తులు స్నానమాచరించేందుకు నిర్మించిన లక్ష్మీపుష్కరిణిలో ప్రతి నిత్యం గోదావరి శుద్ధ జలాలను నింపుతారు. స్వామివారిని అభిషేకించేందుకు గోదావరి శుద్ధ జలాలను వినియోగించుకునే పనులు సాగుతున్నాయి. కుటుంబంతో గడిపేందుకు సహజ సిద్ధమైన చెట్ల పందిళ్లు, బల్లలు, పాథ్‌వే, సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపడుతున్నారు. చెరువుచుట్టూ నడకదారి నిర్మిస్తున్నారు. అదేవిధంగా గండిచెరువును చేరుకునేందుకు లింక్ రోడ్లను సైతం నిర్మించనున్నారు. మిగతా రూ.19.59 కోట్లతో గండిచెరువు పరిసర ప్రాంతాల్లో లాండ్ స్కేపింగ్ గార్డెన్లు, పూల మొక్కలు, దేవతావృక్షాలు, ఔషధ మొక్కలను నాటనున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు లేజర్ షోలను తలపించే విధంగా ఫౌంటెన్లు నిర్మించనున్నారు. పరిసర ప్రాంతాల్లో ఆర్నమెంటల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. భక్తిభావం పెంపొందించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించే విధంగా విశాలమైన హాళ్లను నిర్మించనున్నారు.
రాయగిరి చెరువు అలుగుపోసే ప్రాంతంలో రెండు ఎకరాల స్థలాన్ని శిల్పారామం కోసం కేటాయించారు. ఇందులో 1.20 ఎకరాలలో అభివృద్ధి పనులు చేపట్టారు. పరిసరాలన్నీ పచ్చదనంతో వెల్లివిరిసేలా గ్రీనరీ ఏర్పాటు చేశారు. శిల్పారామంలోకి ప్రవేశించే మార్గంలో స్వాగతతోరణం నిర్మించారు. పిల్లలు అడుకొనేందుకు, పెద్దలు సేద తీరేందుకు మైదానాన్ని సిద్ధంచేశారు. పర్యాటక ఆదరణ పొందేలా ఫౌంటెన్, విభిన్న రుచులతో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు మధ్యలో ఐలాండ్, పక్కనే వంతెన వంటి నిర్మాణాలతోపాటు బోటింగ్ కోసం చర్యలు చేపట్టారు. ఎటు చూసినా చక్కటి పల్లెటూరి వాతావరణం వెల్లి విరిసేలా, రాత్రివేళల్లో పరిసరాలన్నీ జిగేల్ మనిపించేలా రాయగిరి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు. శిల్ప కళ, హస్తకళా వైభవం ఉట్టిపడే విధంగా రాయగిరి చెరువు ప్రాంతాన్ని అద్భుతంగా మార్చనున్నారు.
యాదాద్రికి ఆనుకొనే బస్వాపూర్ రిజర్వాయర్ (నృసింహ సాగర్) ఉంటుంది. ఇక్కడ అత్యంత ప్రతిష్ఠాకరమైన రీతిలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రం రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటికే 200 ఎకరాలు ఉండగా, మరో 250 ఎకరాలను సేకరిస్తున్నారు. అంతర్జాతీయస్థాయి కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటవుతాయి. మైసూరు బృందావన్ గార్డెన్స్ తరహాలో వనాలను నెలకొల్పుతారు. బస్వాపూర్ రిజర్వాయర్ యాదాద్రికి అతి దగ్గరగా ఉండటమే కాకుండా, హైదరాబాద్ నగరానికి, రింగురోడ్డుకు సమీపాన ఉన్నది. శంషాబాద్ నుంచి చేరుకోవడం సులభం. బస్వాపూర్ రిజర్వాయర్‌లో 11 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నది. ఇక్కడ బోటింగ్ మొదలైన వినోద వసతులు ఉంటాయి. యాదాద్రికి వచ్చేవారు ఇక్కడ బస చేయవచ్చు. సినిమా షూటింగ్ జరిపే స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ విశ్వవిద్యాలయాలు పెడుతామని, ఇతర భారీ నిర్మాణాలు చేపడుతామని అనేక మంది అడుగుతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.
కాళేశ్వరం 16వ ప్యాకేజీలో భాగంగా నిర్మితమవుతున్న ప్రధాన కాలువ తుర్కపల్లి మండల కేంద్రంలోని ముల్కలపల్లి గ్రామంలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో సంగ్యాతండా గ్రామ పరిధిలోని ప్రధాన కాలువకు నీటిని మళ్లించేందుకు బ్రాంచ్ కెనాల్ (ఓటీ-2)ను నిర్మించారు. నృసింహసాగర్ జలాశయానికి గోదావరి జలాలు వెళ్లేందుకు నిర్మించిన ప్రధాన కాలువకు క్రాస్ రెగ్యులెటర్ నిర్మించారు. లక్ష్మీ తటాకానికి (గండిచెరువు) నీళ్లు విడుదలచేసే సమయంలో క్రాస్ రెగ్యూలెటర్ దగ్గర గేట్లను మూసివేస్తారు. ఈ కాలువను ప్రధానంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి పాదాలను తాకుతూ ఆలేరు నియోజకవర్గంలోని మండలాలకు నీళ్లు అందించే లక్ష్యంతో నిర్మించారు. నృసింహసాగర్ (బస్వాపూర్) జలాశయానికి నీళ్లు రాక ముందే ఈ కాలువను ఏర్పాటుచేశారు. తుర్కపల్లి మండలంలోని సంగ్యాతండా, యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్ తండా మధ్యలో ప్రారంభమై తుర్కపల్లి ప్రాంత గ్రామాల నుంచి ప్రవహిస్తూ యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి, దాతారుపల్లి, మల్లాపురం గ్రామశివాలను తాకుతూ గండి చెరువులోకి ప్రవహిస్తుంది. లక్ష్మీ తటాకం (గండిచెరువు) ప్రధాన కాలువ నుంచి 8 కిలో మీటర్లుండగా, ఇందులో 6.50 కిలోమీటర్ల కాలువ, అక్కడి నుంచి మరో 1.50 కిలోమీటర్ల మేర పైపులైన్ల ద్వారా గండిచెరువులోకి స్వచ్ఛమైన గోదావరిజలాలను నింపుతున్నారు.
భువనగిరి కోటను చారిత్రక ప్రదేశంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. సాంస్కృతిక, సంగీత ప్రదర్శనలతో యాత్రికులను ఈ కోట విశేషంగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఇక్కడ కేబుల్‌కార్ ఏర్పాటుచేసే ప్రతిపాదన కూడా ఉన్నది. పోచంపల్లి, కొలనుపాక, గంధమల్ల వంటి ప్రాంతాలతో యాదగిరిని కలుపుకొని టూరిజం ప్య్రాకేజీలను పర్యాటక శాఖ రూపొందిస్తున్నది. యాదాద్రి నుంచి 56 కిలోమీటర్ల దూరంలో కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు అనువుగా రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతోపాటు యాదాద్రి నుంచి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్యాటక ప్రాంతమైన కొండపోచమ్మ జలాశయం వెళ్లేందుకు చక్కటి రోడ్డు మార్గాలను వేశారు. యాదాద్రి ఆలయ సమీపంలో ఇప్పటికే ప్రైవేటు హోటళ్ళు, ఇతర పర్యాటక వసతులు ఏర్పడుతున్నాయి. ఎంతో మంది ఈ చట్టుపక్కల పెట్టుబడులు పెట్టడానికి, సంస్థలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం రహదారులతో అనుసంధానం చేయడం వల్ల ఈ రహదారుల పొడవునా పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందబోతున్నాయి.