యాదాద్రి, నవంబర్ 3 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో గురువారం సాయంత్రం స్వామివారి దర్బార్ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి సేవను చేపట్టారు. ఉత్సవమూర్తులకు తిరువీధి సేవ అత్యంత వైభవంగా సాగింది. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు నరసింహస్వామిని స్థాన సుప్రభాతాన్ని ఆలకించి మేల్కొలిపారు.
అనంతరం స్వామి, అమ్మవారికి తిరువారాధన చేసి, బాలభోగం నివేదన చేపట్టారు. కార్తిక మాసం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. కొండ కింద వ్రత మండపంలో 408 జంటలు వ్రతమాచరించాయి. మహిళలు దీపారాధనలు చేపట్టారు. స్వామివారిని 17వేల మంది భక్తులు దర్శించుకోగా, ఖజానాకు రూ.21,06,765 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.