యాదగిరిగుట్ట, మార్చి4: ఉదయం వటపత్రశా యిగా, రాత్రి హంస వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్స వాలు నాలుగు రోజులుగా ఏకకుండాత్మక, నావాహ్నిక, పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో జరుగుతున్నాయి. ప్రధా నాలయంలో మంగళవారం వేకువజామున ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభారాధన, అగ్ని ఆరాధన, మూల మంత్ర, పంచసూక్త హవనం తదితర పూజలను ఆలయ ప్రధానార్చకులు, యాజ్ఞికులు, రుత్వికులు, పారాయణందారులు నిర్వహించారు.
అనంతరం ఉదయం 8.00 గంటలకు స్వామివారిని వంటపత్ర శాయి అలంకారంలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించారు. రుత్వికులు, వేదపండితులు స్వామివారి అలంకార సేవ ముందు దివ్య ప్రబంధ వేద పారాయణాలు, మూల మంత్ర జప పఠనాలు గావించారు. అనంతరం డోలు సన్నాయి, మేళాలతో స్వామివారిని ప్రధానాల మాఢ వీధుల్లో ఊరేగించారు. స్వామి వారిని తూర్పు మాఢవీధుల్లో ప్రత్యేక వేంచేపు మండ పంలో ఆస్థానం చేసి ప్రధానార్చకులు వటపత్రశాయి విశిష్టతను భక్తుల వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఈఓ భాస్కరరావు, డీఈఓ దొర్భల భాస్కర్ శర్మ, ప్రధానర్చకులు నల్లన్ తీఘల్ లక్ష్మీనరసింహ చార్యులు, వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు.