యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శనివారం స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ప్రతిష్ఠామూర్తులకు నిజాభి షేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు అర్చకులు ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించి స్వామివారి కైంకర్యాలు చేపట్టారు. ఉదయం 8 గంటలకు సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు.
నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవారి కల్యాణ వేడుకను కనులారా వీక్షించి తరించారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. ఆలయం లో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మ వారికి కుంకుమార్చన, అంజనేయ స్వామి వారిని సహస్ర నామార్చన చేశారు. సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.