నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్11 (నమస్తే తెలంగాణ) : వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఐదు యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ఉపముఖ్య మంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార తెలిపారు. ఏడాది చివరికి మూడు యూనిట్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి బుధవారం నల్లగొండ జిల్లా దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భట్టి నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. రెండో యూనిట్లో ఆయిల్ సింక్రనైజేషన్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి ట్రయల్ రన్‌కు స్విచ్ ఆన్ చేశారు.
అనంతరం ప్లాంట్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 31 నాటికి మూడు యూనిట్లలో 2,400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ పవర్ ప్లాంట్ ద్వారా యూనిట్ విద్యుత్తును రూ.6.35కు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చివారికి భూసేకరణ నిధులతోపాటు ప్రాజెక్టులో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యాదాద్రి ప్లాంట్‌తోపాటు పులిచింతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామని డిప్యూటీ సీఎం ఆదేశాలిచ్చారని, వారికి నిర్వాసితుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఇందులో జెన్కో సీఎండీ రోనాల్డ్ రోస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని మంత్రుల బృందానికి వివరించారు.
మంత్రులను నిలదీసిన నిర్వాసితులు
యాదాద్రి పవర్‌ప్లాంటుకు వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు , మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిని భూ నిర్వాసితులు, ల్యాండ్ లూసర్స్ అడ్డుకున్నారు. పవర్ప్లాంటకు భూములిచ్చిన తమకు ఉపాధి కల్పించలేదని నిలదీశారు. స్పందించిన మంత్రులు ప్లాంటుకు భూములు ఇచ్చిన వారు దేవుళ్లతో సమానమని తెలిపారు. మూడు నెలల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించామని చెప్పడంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.