నవ వైకుంఠాన్ని చూడాలన్న ఏడున్నరేండ్ల కోరిక మరికొన్ని క్షణాల్లో నెరవేరబోతున్నది. యాదాద్రిపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం మధ్యాహ్నం నుంచి భక్తులకు పునర్దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టపై అడుగుపెట్టింది మొదలు, స్వామివారిని దర్శించుకొనేవరకు కండ్లముందు కనిపించే అణువణువూ ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని పంచుతుంది. పట్టణంలోకి అడుగుపెట్టగానే ఓం నమో నారసింహాయ మంత్రం ఒంట్లో భక్తిభావాన్ని పెంపొదిస్తుంది. అలా ఆలయంవైపు అడుగులు వేయగానే కొండపైనున్న సప్త గోపురాలు స్వర్గలోక వైకుంఠాన్ని చూసినంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకాస్త ముందుకు వెళ్లగానే వైకుంఠ ద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఇక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా ప్రధానాలయానికి చేరుకోవచ్చు. వాహనాల్లో వచ్చేవారు క్యూకాంప్లెక్స్ల ద్వారా దర్శనానికి రావాలి. ఆలయ పరిసరాల్లోకి చేరుకోగానే ఆలయంలోకి వెళ్లే క్యూలైన్ బంగారు వర్ణంలో మెరుస్తుంది.
శిరస్సెత్తి చూస్తే శిఖరాయమానంగా కనిపించే గోపుర సౌందర్యం ఆలయానికి ప్రత్యేకత తెచ్చింది. నాలుగు దిశల్లో నాలుగు 55 అడుగుల ఎత్తున పంచతల గాలి గోపురాలు ఎత్తారు. ప్రచండ వాయుపీడనాన్ని తట్టుకొనేందుకు ఆ గోపురాలకు నేలనున్న ద్వారంతోపాటు పైన ఏర్పరిచిన గవాక్షాల సంఖ్యను బట్టి త్రితల, పంచతల, సప్తతల గోపురాలుగా మలిచారు. మిగిలిన ప్రాంతాల్లోని దేవాలయాల్లో గాలి గోపురాల బరువు ఎక్కువ కాకుండా ద్వారబంధంపై నుంచి ఇటుకలతో నిర్మాణాలు చేయడం సాధారణం. యాదాద్రి నారసింహుడి ఆలయ గోపురాల నిర్మాణంలో ఆకాశం అంచుల వరకు రాయినే వాడారు. ఆధునిక కాలంలో నిశ్చయంగా ఇదొక విశేష నిర్మాణం. రాయిని రాయిని అతికించేందుకు సంప్రదాయపద్ధతిలో బెల్లం, జనపనార, కరక్కాయ, కలబంద, సున్నం, నీటి మిశ్రమాన్ని వాడారు. రాళ్ల మధ్య పెద్ద అంతరాలను తొలగించడానికి సీసాన్ని కూడా వినియోగించారు. సిమెంట్ మచ్చుకైనా వాడలేదు.
రెండేరెండు గోపురాలతో ఉన్న పాత దేవాలయం నేడు నలువైపుల ఏడు గోపురాలతో అలరారుతున్నది. అస్సాం నుంచి వచ్చిన కర్రదుంగ శ్రేష్ఠమైన వృక్ష స్కంధంతో నిటారుగా 34 అడుగుల సమున్నత దారు ధ్వజంతో ధ్వజస్తంభంగా గర్వంగా నిలుస్తున్నది. దీనికి ఏర్పాటైన వితర్థిక శిలా నిర్మితమే, శిల్పశోభితమే. పడమటి గోపురం సప్తతల గోపురంగా 72 అడుగులతో నిర్మితమైంది. నాలుగు దిశల్లో 55 అడుగులతో పంచతల, ఈశాన్యంవైపు 33 అడుగుల త్రితల గోపురాన్ని నిర్మించారు. మొత్తం సప్త గోపురాలతో సప్తగిరులవలె శోభిస్తున్నది. ఆలయంలో కుడ్యాలపై, స్తంభాలపై చెక్కిన దేవతామూర్తుల సంఖ్య 541. బాహ్యాంతః ప్రాకారాల కుడ్యాలపై, స్తంభాలపై రామాయణ, మహాభారత ఇతిహాసాల దృశ్యాలు చెక్కించారు. ఇది దక్షిణాది ఆలయాల సాదృశ్యంతో చేసింది. పడమటి మహాగోపురం బృహదీశ్వరాలయంలా సమస్త శిలానిర్మితం. ఎనిమిది వందల శిల్పుల సామూహిక స్వప్నం ఈ ఆలయం.
నిలువెత్తుగా రెండంతస్తులుగా శిల్పశోభితమైన ముఖమంటపం, స్వామివారికి చక్రవర్తి సభా మంటపంలా శోభిల్లుతున్నది. నిజానికి ఈ నిర్మాణం కత్తిమీద సాము, రూపకర్తల (డిజైనర్స్) మేధకు పరీక్ష. కారణం స్వామివారి మూల విరాట్టును, దానికి ఆనుకొని ఉన్న కొండను, నృసింహుడు విరాజమానమైన గుహ పవిత్రతను కాపాడుతూ, సవరణలేవీ లేకుండా దాన్ని కలుపుకొని నిర్మాణాలు చేయడం కష్టకార్యం. క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి ఉపాలయాన్ని, గరుడాళ్వారు ఆలయాన్ని, యథాతథంగా ఉంచుతూనే సువిశాల ముఖమంటప నిర్మాణం సాగింది. పై అంతస్తులో తూర్పున స్వామికి అభిముఖంగా, తంజావూరు చిత్రాలతో పురాణగాథలతో చిత్రశాల నిర్మించారు. కుడి వసారాలో భక్తులు వేచి ఉండేందుకు, ఎడమ వసారాలో స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపునకు విశాలంగా నిర్మించారు. శయన మంటపం భక్తుల దర్శనార్థం ఉత్తర ప్రదక్షిణపథంలో నిర్మించారు.