యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి మహాకుంభ సంప్రోక్షణ వేడుకలు చివరి దశకు చేరుకున్నాయి. 8వ రోజు పంచకుండాత్మక యాగంలో భాగంగా బాలాలయంలో ఉదయం 7.30 గంటల నుంచి నిత్యహోమములు, చతు:స్థానార్చన, పరివారశాంతి, ప్రాయశ్చిత్త హోమము, శాలబలి నిర్వహిస్తారు.
ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, మిధున లగ్న పుష్కరాంశ మునగర్త వ్యాసము, రత్నన్యాసము, యంత్ర ప్రతిష్ట,బింబ ప్రతిష్ట, అష్ట బంధనం, కళారోహణం, ప్రాణ ప్రతిష్ట, దిష్టి కుంభం కార్యక్రమాలు ఉంటాయి.
ఉదయం 11:55 గంటలకు మిధున లగ్న ముహూర్తంలో మహా కుంభాభిషేకం, ప్రథమ ఆరాధన, ఆరగింపు, తీర్థప్రసాద గోష్టితో పాటు పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్, 15 మంది మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు శాంతికళ్యాణం, ఆచార్యఋత్విక్ సన్మానం, మహదాశీర్వచనం నిర్వహించనున్నారు.