ఆలయం కట్టడం అంటే నాలుగు ఇటుకలు, బస్తా సిమెంట్, తట్టెడు ఇసుకతో గోడ పేర్చేయటం కాదు.. వెయ్యేండ్లు నిలవాలి.. పది తరాలు మురవాలి.. కోట్లాది భక్తులు దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలి.. అందుకు నిష్ఠతో పనిచేసే యంత్రాంగం ఉండాలి, పక్కాగా, పకడ్బందీగా పనులు సాగాలి, అన్నింటికన్నా ఆలయాన్ని గొప్పగా కట్టాలన్న విజన్ ఉండాలి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణం అచ్చం అలాగే సాగింది. సృష్టి పాలకుడే అబ్బురపడేలా, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పట్టుదలను నిరూపించేలా యాదాద్రి ఆలయ నిర్మాణ మహాయజ్ఞం దిగ్విజయంగా పూర్తయింది.
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ):యాదాద్రి పునర్నిర్మాణ మహాయజ్ఞానికి ఎందరో సహాయ సహకారాలు అందించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నీతానై ముందుండి నడిపించగా, చాలామంది భాగస్వాములయ్యారు. వందలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేశారు. ఈ అద్భుత కార్యాన్ని చేపట్టిన సీఎం.. అధికారులు, నిపుణులతో 20 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహించేందుకు పని విభజన చేశారు. ఒక్కొక్క కమిటీలో పదుల సంఖ్యలో నిష్ణాతులైన అధికారులు, నిపుణులు భాగస్వాములయ్యారు. పక్కాగా రోడ్‌మ్యాప్ రూపొందించారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులుచేశారు. కొన్ని వేల గంటల మేధోమధనం జరిగింది. దేవాలయంలో చేపట్టే పనుల కోసం కొన్ని వేల మైళ్లు ప్రయాణం చేశారు. వందల సంఖ్యలో పుస్తకాలు తిరగేశారు. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేశారు.

మొత్తం నిర్మాణ పర్యవేక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చైర్మన్‌గా 2015 మే 27న యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. ఇందులో దేవాదాయ, సాంస్కృతిక, పట్టణాభివృద్ధి, అటవీ, రోడ్లు, భవనాలు, రవాణా.. ఇలా అన్ని శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు. వైస్ చైర్మన్, సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కిషన్‌రావును నియమించారు. ఈవో గీత, ఇతర అధికారులు ఉన్నారు. ఈ అథారిటీ కింద యాదగిరిపల్లి, సైదాపూర్, మల్లాపూర్, దత్తార్పల్లి, గుండ్లపల్లి, రాయిగిరి, బస్వాపూర్‌ను అభివృద్ధి చేశారు.
దేవాలయంలోని ప్రధానమైన శిల్పాలకు రాయిని ఎంపిక చేసేందుకు కమిటీని వేశారు. దీంట్లో డాక్టర్ వేలు స్థపతిగా ఉన్నారు. ప్రముఖ శిల్పి హరిప్రసాద్, వైటీడీఏ కన్సల్టెంట్ ఇంజనీర్ రాఘవేందర్రావు సభ్యులుగా ఉన్నారు. ప్రకాశం జిల్లా గురుజపల్లిలో శ్రేష్ఠమైన కృష్ణ శిల ఉన్నట్టు నిర్ధారించి, అక్కడి క్వారీని లీజుకు తీసుకొని అవసరమైన శిలలను తెచ్చారు. శిల్పాలను చెక్కేందుకు ఉపయోగించే రాయి నాణ్యతను నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ మెటీరియల్స్ (ఎన్సీసీబీ) పరిశీలించింది.
శిల్పులు, శిల్పాల ఎంపిక తదితర అంశాలపై సలహాలు ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటుచేశారు. ప్రపంచ ప్రఖ్యాత స్థపతి, పద్మ విభూషణ్, ఒడిశాకు చెందిన రఘునాథ మహాపాత్రో, తమిళనాడుకు చెందిన హిందూ సంప్రదాయాలు, దేవాలయ, ధార్మిక సంస్థల నిపుణుడు, స్థపతి దక్షిణామూర్తి, మరో ప్రముఖ స్థపతి, వైటీడీఏ సలహాదారు సుందరరాజన్, తెలంగాణ దేవాదాయ శాఖకు చెందిన డిప్యూటీ ఈఈ శ్రీనివాసశర్మను కమిటీలో నియమించారు. వీరు శిల్పులు, శిల్పాల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు. కరోనా సమయంలో రఘునాథ మహాపాత్రో మరణించారు. ఆయన సూచనలన్నింటినీ యాదాద్రి నిర్మాణంలో పరిగణనలోకి తీసుకొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 475 మంది శిల్పులు శిల్పాలను చెక్కారు.
యాదగిరిగుట్ట నాణ్యతను, బండలోని గట్టిదనాన్ని నిర్ధారించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జియో టెక్నికల్ కమిటీలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల హెడ్‌గా, బండలు, గుట్టలపై సుదీర్ఘ అధ్యయనం చేసిన డాక్టర్ బాబూరావు, ఓయూ, ఐఐటీ ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పనిచేసిన డాక్టర్ రమేశ్‌రెడ్డి, జియో ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేసిన డాక్టర్ వెంకటరావును సభ్యులుగా నియమించారు. వీరు అరెకరం ఉన్న గుట్టను నాలుగు ఎకరాలకు విస్తరించడానికి అవసరమైన సూచనలు ఇచ్చారు. విమాన గోపురానికి సంబంధించి కూడా వీరే సలహాలు, సూచనలు అందించారు.
ఆగమ, వైఖానస శాస్ర్తాలు, వాస్తు శాస్ర్తాలకు అనుగుణంగా శిల్పాలు ఉన్నాయా? లేదా? అని తెలుసుకొనేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్పర్ అండ్ అర్కిటెక్చర్ కళాశాలలోని టెంపుల్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ పీ సుబ్రమణి స్థపతి, విజయవాడ, అమరావతిలో కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈ శివనాగిరెడ్డి స్థపతి, తమిళనాడుకు చెందిన కే దక్షిణామూర్తి స్థపతి పనిచేశారు.
శిల్పులు శిలను చెక్కేప్పుడు కొన్ని సందర్భాల్లో నాణ్యత దెబ్బతినొచ్చు. దానికోసం శిల్పాల నాణ్యతను తెలుసుకోడానికి, మన్నిక ఎలా ఉంటుందో చెప్పడానికి సంస్థలుంటాయి. వైటీడీఏ మెస్సర్స్ సీవెల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీతో ఒక కమిటీ ఏర్పాటుచేశారు. ఈ సంస్థ సాం కేతిక సంచాలకుడు ఉమా వెంకటరమణ, సింహాచలం తో పాటు పీ రాజు నాణ్యత పరీక్షలను నిర్వహించారు.
యాదాద్రి పునర్నిర్మాణంలో సిమెంట్‌ను వాడలేదు. దేవాలయానికి అవసరమైన మేరకు డంగు సున్నం మిశ్రమాన్ని తయారుచేశారు. డంగు సున్నాన్ని వాడితే కనీసం వెయ్యేండ్లపాటు మన్నిక ఉంటుందని నిపుణులు చెప్పారు. దీంతో బెల్లం, సున్నం, కరక్కాయ, కొబ్బరిపీచు తదితరవాటిని ఉపయోగించి పురాతన పద్ధతిలో డంగుసున్నం తయారుచేశారు. దీని నాణ్యతను బ్యూరో వెరైటీస్ లిమిటెడ్ ఇంజనీర్ల బృందం పరిశీలించింది.
మండపాలు, ద్వారాలకు అమర్చే దర్వాజాల కోసం నాణ్యమైన టేకును వినియోగించారు. కర్ర నాణ్యతను తెలుసుకొనేందుకు బెంగళూరులోని ఇండియన్ ైప్లెవుడ్ ఇండస్ట్రీస్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పరీక్షలు చేసింది. దీనికి సంబంధించి డీ నర్సింహమూర్తి స్వయంగా యాదాద్రికి వచ్చి కర్ర నాణ్యత పరీక్షలు నిర్వహించారు.
యాదాద్రి కొండపైకి వెళ్లేదారితోపాటు చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద ఎత్తున రోడ్లు వేశారు. రోడ్ల నిర్మాణం కోసం ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశారు. దీని చైర్మన్‌గా రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్రావు, సభ్యులుగా ఆర్అండ్బీ మరో ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వీ మధ్వారాజ, కోఆప్టెడ్ సభ్యులుగా టీటీడీ మాజీ టెక్నికల్ అడ్వైజర్, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్ కొండల్రావు, దేవాదాయశాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి ఉన్నారు.
యాదగిరిగుట్టను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ కమిటీని నియమించింది. ఈ కమిటీలో యాదాద్రి-భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, భువనగిరి ఆర్డీవో, సంబంధిత మండల తహసీల్దార్ సభ్యులుగా ఉన్నారు. 1,900 ఎకరాలకుపైగా భూసేకరణ చేశారు.
యాదాద్రి పనుల సమన్వయానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక సమన్వయ కమిటీ ఏర్పడింది. సీఎస్ చైర్మన్‌గా, రెవెన్యూ, పురపాలక, పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, దేవాదాయ శాఖ కమిషనర్, ఇద్దరు ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైటీడీఏ వైస్‌చైర్మన్, సీఈవో, ఆలయ స్టాట్యూటరీ ఆడిటర్ మురళీకృష్ణ సభ్యులుగా ఉన్నారు.
యాదాద్రి పరిసరాల్లోకి వెళ్లడంతోనే ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పచ్చనిచెట్లు కనిపిస్తాయి. వీటిని ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయడానికి సీఎం కార్యాలయంలోని ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, సోషల్ ఫారెస్ట్రీలో అపార అనుభవం ఉన్న రాజేందర్‌రెడ్డి బాధ్యత తీసుకొన్నారు. ల్యాండ్స్కేపింగ్తోపాటు యాదాద్రి చుట్టూ పచ్చని వనాలను ఏర్పాటుచేయటంలో కీలక పాత్ర పోషించారు.
యాదాద్రిలో కాటేజీల నిర్మాణానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి రూ.ఏడున్నర కోట్లతో 15 ప్రెసిడెన్షియల్ సూట్లు, రూ.2 కోట్లతో 250 ప్లాట్లలో 250 సూట్లు, గదులు, వంద గదులతో తిరుపతిలోని శ్రీనివాసం తరహాలో మరో అతిథి గృహాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తెస్తున్నారు.

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి నేతృత్వంలో క్రియేటివ్ వర్క్ కమిటీ ఏర్పాటైంది. ఆనందసాయి, స్థపతి వేలు దీన్ని ముందుండి నడిపించారు. కొన్ని వేల గంటల సమయాన్ని వెచ్చించారు. అనేక మంది ఆర్ట్ వర్క్‌లో పాల్గొన్నారు. వీటితోపాటు అటవీ, పంచాయతీరాజ్, నీటిపారుదల, రవాణా తదితర శాఖలతో కమిటీలు ఉన్నాయి.