సంస్థాన్ నారాయణపురం, జూన్ 27: నమస్తే తెలంగాణ దినపత్రికలో గురువారం (జూన్ 26) ప్రచురితమైన కాసులు కురిపిస్తున్న ఫోర్జరీ (Forgery) దందా కథనానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. ఇదే విషయమై విచారణ చేపట్టాలని స్థానిక ఆర్డీవో శేఖర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్డీవో శేఖర్ రెడ్డి మొదట కార్యాలయంలోని గతంలో విచారణ చేపట్టిన కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను తెప్పించుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన ఆర్డీవో అధికారుల స్టాంపులు, సంతకాలు ఫోర్జరీ జరిగినట్లు గుర్తించారు.
అనంతరం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందున్న వివిధ మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లలో తనిఖీ చేశారు. ఫోర్జరీ జరిగిన కల్యాణ లక్ష్మి దరఖాస్తులు మండల కేంద్రంలో ఉన్న మీసేవ, నెట్ సెంటర్లో జరిగినట్లు గుర్తించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కల్యాణ లక్ష్మి దరఖాస్తుల్లో మెడికల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఎంపీఓ సంతకాలు దాదాపు 20 పైగా దరఖాస్తుల ఫోర్జరీ జరిగినట్లు తేల్చారు. ఫోర్జరీ సంతకాలు చేసిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్ఐ జగన్ను ఆదేశించారు. ఫోర్జరీ సంతకాల విషయంలో మెడికల్ ఆఫీసర్ రవీనా, తాసిల్దార్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ జగన్ వెల్లడించారు.