హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగసుఏ్ట 10 (నమస్తే తెలంగాణ) : దేవాదాయ శాఖ మంత్రి కొడా సురేఖ ఇంటిలో జరిగిన ప్రైవేటు పూజల్లో వివిధ ఆలయాలకు చెందిన అర్చక ఉద్యోగులు పాల్గొనడంపై పెద్ద దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై ఆ శాఖ ఉద్యోగులే మండిపడుతున్నారు. మంత్రికో న్యాయం.. సామాన్య అర్చక ఉద్యగులకు ఓ న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే పురోహితులు, వేద పండితులు ఆలయ కార్యక్రమాల్లో కాకుండా ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇటీవల ఓ సర్క్యులర్‌ను జారీచేశారు.
అయినా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటిలో లక్ష్మీ నృసింహస్వామి కల్యాణం, సుదర్శనయాగం, శివ కల్యాణాల్లో వివిధ ఆలయాలకు చెందిన అర్చక ఉద్యోగులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట అర్చకులు, ఉద్యోగులు కూడా పాల్గొని కల్యాణ తంతు నిర్వహించారు. యాదగిరిగుట్ట ప్రధాన అర్చకుడు కాండూరి వెంకట్రమణాచార్యులు, కిరణ్‌కుమారాచార్యులు, ఉద్యోగులు భాస్కర్‌శర్మ, రవి తదితరులు ఈ పూజల్లో పాల్గొన్నారు. మంత్రి ఇంటిలో జరిగిన పూజల్లో పాల్గొన్న అర్చకులకు అనుమతే లేదని, ఆలయ ప్రధాన ఉద్యోగులు కూడా అక్కడే ఉండి పూజా కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహరంలో మంత్రి అనధికారిక ఆదేశాలకు భయపడి మంత్రి ఇంట్లో పూజా కార్యక్రమాలకు అర్చకులు వచ్చారని చెప్తున్నారు.
దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులు ప్రైవేటు పూజల్లో పాల్గొనరాదని మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో సర్క్యులర్ జారీ చేస్తున్నట్టు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పేర్కొనడం గమనార్హం. తొలుత ఈ విషయంపై ఆలయ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత జోగులాంబ ఆలయ అర్చకులు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారంటూ వారికి నోటీసులిచ్చి, వివరణ ఇవ్వాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. తన శాఖాపరంగా జారీచేసిన ఆదేశాలను ఆ శాఖ మంత్రి మాత్రం పట్టించుకోకుండా తుంగలో తొక్కారని ఆరోపిస్తున్నారు.