యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకించి, పట్టు వస్ర్తాలను ధరింపజేసి వివిధ రకాల పుష్పాలతో ఆలంకరించారు. వేకవజామున ఆరాధన, సహస్త్ర నామార్చన, సువర్ణ పుష్పార్చన వంటి నిత్య కైంకర్యాలను నిర్వహించారు.
ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హో మం జరిపారు. ప్రతీరోజు నిర్వహించే నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ము స్తాబు చేసి గజ వాహనంపై ముఖః మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు.
ఆలయంలో దర్శనం అనంతరం రూ.100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని వ్రత మాచరించారు. కొండ కింద పాత గోశాల వద్ద వసతి గృహంలో వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.