Y Satish Reddy | సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో పాజిటివ్ దిశగా దూసుకెళ్తూ నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణను.. ఇప్పుడు విధ్వంసం దిశగా నంబర్‌వన్‌గా మారుస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణను ఇప్పుడు నిరుద్యోగంలో నంబర్‌వన్‌గా మార్చారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నిరుద్యోగిత రేటు 8.9 శాతానికి చేరిందని అన్నారు. ఇది దేశంలోనే అత్యధికమని అన్నారు.
జనవరి 2022లో తెలంగాణ నిరుద్యోగిత రేటు 0.7 శాతంగా ఉంటే ఇప్పుడు అది 8.9 శాతానికి పెరిగిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది కాబట్టి పెట్టుబడులు పెరిగాయని.. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని అన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప.. నిర్మాణం జరగడం లేదని అన్నారు. అందుకే ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు తమ సంపాదన మీద పడి.. యువతకు ఉద్యోగాలు కల్పించడం.. ఉపాధి చూపడంపై ఫోకస్ పెట్టడం లేదని ఆయన విమర్శించారు. తీవ్రమైన కరోనా ఉధృతిలో కూడా తెలంగాణ నిరుద్యోగిత రేటు 5.8శాతంగా ఉందని.. ఇప్పుడు ఎలాంటి విపత్తు లేకున్నా.. 8.9శాతానికి పెరగడం ఏంటని ఆయన ఆశ్యర్యం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లక్ష ఉద్యోగాలు ఇచ్చామని సర్కారు చెప్పుకుంటోందని.. మరి అవన్ని ఎక్కడ పోయాయని వై.సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే.. మూడు సార్లు దావోస్ కు వెళ్లి.. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. యువతకు 10 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారని గుర్తుచేశారు. మరి ఆ 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తూ.. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తున్నారని గప్పాలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐ సదస్సు, ఫ్యూచర్ సిటీ అంటూ.. వందల కోట్లు వృథా చేస్తున్న రేవంత్ రెడ్డి.. మరి వాటి ద్వారా వచ్చిన ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో చూపించాలని సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్ వరకు సవ్యంగా ఉన్న వ్యవస్థలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఎందుకు కుప్పకూలుతున్నాయని ప్రశ్నించారు.
తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు.. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని పొరుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చుకుంటున్న రాహుల్ గాంధీ దీనికి ఏం సమాధానం చెబుతారని వై.సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప.. పని మీద కాంగ్రెస్ నాయకులకు ఆసక్తి లేదని ఆరోపించారు. అందుకే రాష్ట్రం నానాటికి దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనాను మించిన మహమ్మారి కాంగ్రెస్ తెలంగాణకు పట్టింది కాబట్టే ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. తెలంగాణలో మళ్లీ ఆనాటి రోజులు రావడం పక్కా అని అన్నారు. ఉపాధి లేక, పనులు దొరక్క.. పొట్ట చేతపట్టుకుని.. బొంబాయి, దుబాయి వలసలు పోయిన రోజులు తెలంగాణలో తిరిగి రావడానికి ఎక్కువ సమయం కూడా పట్టబోదన్నారు. కాంగ్రెస్ సర్కారు ఇకనైనా ప్రజలకు వాస్తవాలు చెప్పి.. రాష్ట్రం పరువు తీస్తున్నందుకు.. తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.