మంది బిడ్డలను మా బిడ్డలని చెప్పుకోవడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిపోయిందని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి విమర్శించారు. అన్ని రంగాల్లో అదే పనిచేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన పనులను, పూర్తి చేసిన పనులను తమ ఖాతాలో వేసుకుని పబ్లిసిటీ చేసుకుంటోందని తెలిపారు.
తాజాగా.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలు సబ్సిడీపై అందిస్తామంటూ మంగళవారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ కార్యక్రమం నిర్వహించి అధికారులతో కలిసి హడావుడి చేశారిన సతీశ్ రెడ్డి తెలిపారు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగులకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలు అందించాలనే స్కీంను తీసుకొచ్చిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. తెలంగాణ రెడ్కో ద్వారా ఈ పథకం అమలును ప్రారంభించామని తెలిపారు. ఆనాడు.. రెడ్కో సంస్థ చైర్మన్ గా అనేక ప్రభుత్వ శాఖలకు స్వయంగా లేఖలు రాశానని స్పష్టం చేశారు.
ఉద్యోగులు ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనుగోలు చేస్తే.. 10 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని వారికి తెలిపామని అన్నారు. ఉద్యోగులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశామని తెలిపారు. అంతేకాదు.. టీఎస్ ఈవీ యాప్ తీసుకొచ్చి.. అందులో ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు కూడా పొందుపరిచామని చెప్పారు. ఉద్యోగులు యాప్ ఓపెన్ చేసి అందులో వాహనాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా కల్పించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక బాధ్యతగా కాలుష్య నియంత్రణలో కలిసి రావాలని పిలుపునిచ్చామన్నారు.
అయితే.. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేం చేసిన పనికి ఇఫ్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ స్కీం ఇప్పుడే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చినట్టుగా.. మొబైల్ అప్లికేషన్ కూడా తామే తెచ్చామన్నట్టుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారని మండిపడ్డారు. TS EV పేరుతో ఉన్న యాప్ ను TG EV గా మార్చారు తప్ప.. అందులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు. కొత్తగా వాళ్లు చేసింది కూడా ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడాకాన్ని పెంచేలా ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేయడమే కాదు.. చార్జింగ్ వసతులు కూడా మెరుగుపరిచేందుకు కృషి చేశామని తెలిపారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం.. గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్టుగా విమర్శలు చేస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను కూడా తామే చేశామని కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.