Y Satish Reddy | మంత్రి సీతక్కపై రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి మండిపడ్డారు. ఆమె తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నతీరుగానే ఉందని విమర్శించారు. అంగన్వాడీల సెల్ఫోన్ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి గారూ దీనికి సిద్దమేనా అని సవాలు విసిరారు.
ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పు తెగుతుందని మంత్రి సీతక్క ఇచ్చిన వార్నింగ్పైనా సతీశ్ రెడ్డి కౌంటర్లు విసిరారు. మేం ఆధారాలతోనే కొడతాం.. మాకు చెప్పులు అవసరం లేదని స్పష్టం చేశారు. మంత్రి హోదాలో ఉండి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందని పునరుద్ఘాటించారు. అంగన్వాడీ టీచర్లకు 5జీ ఫోన్లు ఇవ్వాలని కేంద్రం చెబితే.. 4జీ ఫోన్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో నూటికి నూరు శాతం స్కామ్ జరిగిందని అన్నారు. కుంభకోణాన్ని బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టే సరికి సీతక్క ఫ్రస్ట్రేషన్లో ఊగిపోతున్నారని అన్నారు. దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని విమర్శించారు.