న్యూఢిల్లీ, ఆగస్టు 11: పుకెట్-ఢిల్లీ మార్గంలో గతవారం ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం నడిపిన పైలట్ ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్నట్టు వెల్లడైంది. విమానం గాలిలో ఉండగా.. ఒక్కసారిగా 300 అడుగులు కింది కి వచ్చేసింది. దీంతో 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. దీనిపై దర్యాప్తు జరిపిన అధికారులు ప్రయాణం అనంతరం ఆ విమానం నడిపిన పైలట్‌కు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఒక సైకోయాక్టివ్ పదార్థానికి పాజిటివ్‌గా తేలారని విశ్వసనీయ వర్గాలు మంగళవారం తెలిపాయి.
ఆ విషయాన్ని నిర్ధారించుకొనేందుకు జరిపిన మరో పరీక్షలో అతడు గంజాయి తీసుకున్నట్టు వెల్లడైందని ఓ అధికారి పేర్కొన్నారు. ఈ నెల 4న 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో ఎయిర్ ఇండియా విమానం ఫుకెట్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఒక్కసారిగా కిందికి జారిపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. దీంతో ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించిన యాజమాన్యం దర్యాప్తుకు ఆదేశించింది.