గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమై నదులను తలపిస్తుండటంతో ‘కార్స్ 24’ సంస్థ వినూత్నంగా ఒక బ్రాండెడ్ నీలిరంగు పడవను రోడ్లపైకి తెచ్చింది. నగరంలో వరద పరిస్థితిని ఎద్దేవా చేస్తూ, సదరు సంస్థ చేసిన ఈ పనికి రూ 50,000 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటనపై కార్స్ 24 సంస్థ బ్రాండ్ అండ్ కమ్యూనికేషన్ హెడ్ ప్రాచీ శర్మ స్పందిస్తూ ‘మేము చేసిన ఈ పనికి జరిమానా కట్టాం. అయితే అసలు నగరాన్ని ఇలా నీటిపాలు చేసిన అధికారులకు జరిమానా ఎవరు వేస్తారు?’ అని ప్రశ్నించారు. ఈ పడవను తాము కేవలం అధికారుల వైఫల్యాన్ని, రోడ్ల దుస్థితిని ఎత్తిచూపేందుకే ప్రయోగించామని ఆమె తెలిపారు. ఒక జోక్ రోజువారీ అవసరంగా మారినప్పుడు అది జోక్ కాదని ఆమె అన్నారు. రోడ్లపై పడవలు నడపాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని, తాము ఈ జరిమానాను భరించేందుకు సిద్ధమేనని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే తాము మరోసారి పడవను దించాల్సి వచ్చినా వెనుకాడబోమని తెలిపారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాకనే స్పందించగలనని గురుగ్రామ్ ట్రాఫిక్ ఏసీపీ సత్యపాల్ యాదవ్ తెలిపారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.