సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : రాజధాని పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు సొంత గ్రామాల్లోనే తమ ఓటు కొనసాగించుకునేందుకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి ఏకంగా 43 లక్షలకు పైగా ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్ఓ (అధికారుల)కు చేరలేదు. అంటే ఆ ఓటర్లు జాబితా నుంచి తొలగిపోయినట్లే భావించాల్సి వస్తుంది.
సర్ కార్యక్రమానికి ముందు ఈ మూడు జిల్లాల పరిధిలో కోటీ 14 లక్షల 15వేల 542 మంది ఓటర్లు ఉండగా..ప్రస్తుతం 43,06,526 ఓట్లు రద్దు అయ్యే జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన జిల్లా…కానీ ఓటర్ల సవరణ ప్రక్రియలో మాత్రం ఇక్కడ భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. జిల్లా పరిధిలో మొత్తం 47 లక్షల 36 వేల 669 ఎన్యుమరేషన్ పత్రాలు పంపిణీ చేయగా..ఇప్పటి వరకు 27 లక్షల 95వేల 225 పత్రాలు అంటే 59.01 శాతం బీఎల్ఓలకు చేరాయి.
మరో 19 లక్షల 41వేల 444 పత్రాలు అంటే 40.99 శాతం అధికారులకు చేరలేదు. జిల్లా పరిధిలో సగటున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష నుంచి లక్షన్నర వరకు ఓట్లు తగ్గే పరిస్థితి కనిపిస్తున్నది. అత్యధికంగా జూబ్లీహిల్స్‌లో లక్షా 79వేల 510 ఓట్లు, యాకత్‌పురాలో లక్షా 55వేల 252, చాంద్రాయణగుట్టలో లక్షా 49వేల 365, మలక్‌పేటలో లక్షా 47వేల 552, కార్వాన్లో లక్షా 42వేల 16, ముషీరాబాద్‌లో లక్షా 40వేల 381 ఓట్లు తగ్గే అవకాశం ఉంది. ఇలా హైదరాబాద్ జిల్లాలో 19 లక్షల 41వేల 444 పత్రాలు అధికారులకు అందలేదు.. అంటే ఈ ఓట్లన్నీ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వాస్తవంగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ పత్రాలు తిరిగి వచ్చిన శాతం ఒకేలా లేదు. బహదూర్‌పురలో అత్యధికంగా 65.33 శాతం పత్రాలు బీఎల్ఓలకు చేరాయి. కార్వాన్లో 62.94, సికింద్రాబాద్‌లో 61.56 శాతం, చాంద్రాయణగుట్టలో 60.41 శాతం, నాంపల్లిలో 60.27 శాతం పత్రాలు తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు..కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ముందుకు వస్తుండగా మరిన్ని ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పత్రాలు తిరిగి రాకపోవడం ఆసక్తికరంగా మారింది. నగరంలో నివసిస్తున్న కొంతమంది ఓటర్లు తమ శాశ్వత చిరునామా ఉన్న (గ్రామాలు)ప్రాంతాల్లోనే ఓటు కొనసాగించేందుకు మొగ్గు చూపారు అన్నది స్పష్టంగా అర్థమవుతున్నది.