హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : విద్యాసంస్థలపై పెత్తనం కోసం సర్కార్ పాకులాడుతున్నది. ఇటీవలీ కాలంలో జారీచేసిన అటానమస్ హోదా, డీమ్డ్వర్సిటీల అనుమతులు నిలిపివేయాలని యూజీసీకి లేఖ రాసింది. తక్షణమే ఆయా అనుమతులను హోల్డ్‌లో పెట్టాలని కోరింది. 2025-26 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో డీమ్డ్ వర్సిటీల ఏర్పాటుకు 6 విద్యాసంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఈ వర్సిటీల ఏర్పాటుకు జేఎన్టీయూ నిరభ్యంతరపత్రం(ఎన్వోసీ) జారీచేయాల్సి ఉంది. ఇదే కాకుండా అదనపు సీట్లకు, కోర్సుల మార్పిడికి, విలీనానికి సైతం జేఎన్టీయూ ఎన్వోసీ జారీచేయాలి. అయితే డీమ్డ్ వర్సిటీలకు ఎన్వోసీ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది.
అంతేకాకుండా కొత్త కోర్సులు, కోర్సుల కన్వర్షన్, అదనపు సీట్ల పెంపునకు ఎన్వోసీ ఇవ్వరాదని ఇటీవలే ప్రభుత్వం యూజీసీకి, జేఎన్టీయూకు రెండు వేర్వేరు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఈ ఆరు డీమ్డ్ వర్సిటీలకు ప్రభుత్వ అనుమతులు రావడం కష్టంగానే కనిపిస్తున్నది. అంతేకాకుండా అదనపు సీట్లకు బ్రేక్‌లు పడనున్నాయి. తమ ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకోవద్దని జేఎన్టీయూకు ప్రభుత్వం హెచ్చరికలు పంపింది. తొలుత రాష్ట్రంలో ఉన్న కోర్సులు, కాలేజీలను బలోపేతం చేయాలని తలంటుపోసినట్టు తెలిసింది.
అటానమస్, డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ ఉండటంలేదు. ‘ఎన్వోసీ ఇవ్వడం వరకే రాష్ట్ర ప్రభుత్వం పాత్రనా..? ఇదేం విధానం. మా రాష్ట్రంలో విద్యాసంస్థను ఏర్పాటు చేస్తున్నప్పుడు మా అజమాయిషీ ఉండొద్దా. నీళ్లు ఇచ్చేది మేమే. కరెంట్ ఇచ్చేది మేమే. అన్ని రకాల వసతులు కల్పించేది మేమే. కానీ మా నియంత్రణ ఉండకూడదా.. ? మేం తనిఖీలు చేసి అన్ని రకాలుగా ఒకే అంటేనే అనుమతులివ్వాలి. లేదంటే ఇవ్వరాదు. ఇష్టారీతిన ఇస్తే మేం అనుమతించబోం..’ అంటూ లేఖలు రాసింది.