హనుమకొండ, ఆగస్టు 6: పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఎద్దేవాచేశారు. బుధవారం హనమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పీపీటీ ద్వారా వివరించారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ఏకమై బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నాయని, దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఘోష్ కమిషన్ ఇచ్చింది కేవలం నివేదిక మాత్రమేనని, అది జడ్జిమెంట్ కాదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. నన్నపునేని ఫౌండేషన్‌తో 119 నియోజకవర్గాల్లోని మేధావులను ఏకం చేసి, కాళేశ్వరంపై సమగ్ర సమాచారాన్ని ప్రజలందరికీ చేరువచేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు.