జహీరాబాద్: దేశంలో టమాట (Tomato) ధరలు మండిపోతున్నాయి. కిలో ధర రూ.100 దాటడంతో వాటి చోరీలు కూడా ఎక్కువయ్యాయి. అమ్ముకుందామని కూరగాయల మార్కెట్‌కు తెచ్చిన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు.
జహీరాబాద్‌కు (Zaheerabad) చెందిన ఓ రైతు టమాటాలు అమ్మడానికి పట్టణంలో కూరగాయల మార్కెట్‌కు తీసుకొచ్చాడు. అయితే శుక్రవారం రాత్రి టమాటా ట్రేలను దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు. అయితే తెల్లారి వచ్చి చూసేసరికి రూ.6,500 విలువైన మూడు ట్రేలు మాయమయ్యాయి. గుర్తించిన రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి టమాటా ట్రేలను ఎత్తుకెళ్తు కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని పుణెలో కూడా చోటుచేసుకున్నది. పుణె జిల్లా పింపర్‌ఖేడ్‌కు చెందిన అరుణ్ ధామ్ తన పొలంలో పండిన 400 కిలోల టమాటాలను పెట్టెల్లో సర్ది వాటిని రాత్రి ఒక వాహనంలో ఉంచి ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం వాహనాన్ని మార్కెట్‌కు తీసుకెళ్దామని చూడగా టమాటాలున్న బాక్స్‌లన్నీ చోరీ అయ్యాయి. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.