Govt Schools | మద్దూరు (కోస్గి) : సీఎం రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలోని నాచారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పురుగుల అన్నమే పెడుతున్నారు. ఆ అన్నం తినక శనివారం విద్యార్థినులు నిరసన తెలిపారు. తాండూర్ – మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఉడికీ.. ఉడకని, పురుగుల అన్నం, నాణ్యతలేని భోజనం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెల్దండ : పురుగుల అన్నం పెడుతున్నారంటూ నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మోడల్ కళాశాల వసతి గృహ విద్యార్థినులు నిరసన తెలిపారు. శుక్రవారం రాత్రి వడ్డించిన అన్నంలో పురుగులు రావడంతో కొందరు విద్యార్థినులు తినలేదు. శనివారం ఉదయం, మధ్యాహ్నం కూడా తినకుండా నిరసనకు దిగారు. అయితే ఐదుగురు విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతుండగా కేర్ టేకర్ వారిని స్థానిక ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. భోజనం చేయకపోవడంతోనే గ్యాస్టిక్ సమస్యతో నొప్పి వస్తుందని వైద్యులు తెలిపారు.
కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఉప్పు కారం లేని పప్పు వడ్డించడంతో తినేందుకు ఇష్టపడలేదు. ఆకలిగా ఉందని చెప్పడంతో కారం, నూనె ఇవ్వగా విద్యార్థులు దాంతోనే కడుపు నింపుకొన్నారు. విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు శనివారం బడికి వచ్చి మధ్యాహ్న భోజనాన్ని అడ్డుకుని ఎంఈవోకు నాగనాథ్కు ఫిర్యాదు చేశారు.