హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ ఎంతో కృషిచేసిందని దివ్యాగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి చెప్పారు. నాడు 500 ఉన్న వికలాంగుల పింఛన్ రూ.4 వేలకు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం తెలంగాణభవన్‌లో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్, బేవెరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇంచార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన కేక్ కట్‌చేశారు.
ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కేసీఆర్ దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. దివ్యాంగుల కోసం కేసీఆర్ తెచ్చి న అనేక పథకాలకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్రంలోని ప్రతి దివ్యాగుడికి రేవంత్‌రెడ్డి సర్కారు రూ.24 వేలు బాకీ పడిందని దేవీప్రసాద్ విమర్శించారు. 4 వేల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఏడాదైనా పెంచలేదని, 12 నెలలకు ఒక్కో నెలకు రూ.2 వేల చొప్పున రూ.24 వేలు చెల్లించాల్సి ఉన్నదని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అంటేనే మానవత్వాని కి మారుపేరని మాజీ ఎమ్మెల్యే బాల సుమ న్ పేర్కొన్నారు. దివ్యాంగులు అడగకుండానే కేసీఆర్ అన్నీ ఇచ్చారని, పింఛన్ మొత్తాన్ని పెంచడంతోపాటు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారని గుర్తుచేశారు. రేవంత్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.