నీలగిరి, నవంబర్ 20 : నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు 5 నెలల నుంచి వేతనాలు రావడంలేదని గురువారం జిల్లా జనరల్ దవాఖాన ఎదుట ధర్నా నిర్వహించారు. మెడికల్ కాంటాక్ట్ వరర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందుల గురిచేస్తున్న ఏ1 ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆరు నెలలుగా కార్మికులకు కాంట్రాక్టర్ ఫీఎఫ్ కూడా కట్టడం లేదని ఆరోపించారు.
హైదరాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ) : నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్‌లో పనిచేస్తున్న దాదాపు 17,514 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, ఎన్హెచ్ఎం కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎం నరసింహ డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కోఠిలోని హెల్త్ క్యాంపస్‌లో పెండింగ్ వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేశారు.
పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్హెచ్ఎంలో 78 రకాల క్యాడర్ల ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరికి క్యాడర్ ఫిక్సేషన్ చేసి రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో బేసిక్ వేతనం ఇవ్వాలని అనేక ఏళ్లుగా పోరాడుతున్నట్టు ఆయన గుర్తుచేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కనీస వేతనాలకు కూడా నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ బకాయిల కోసం విజ్ఞప్తులు చేసినా, అధికారుల్లో చలనం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్నా అనంతరం చీఫ్ ప్రొగ్రామింగ్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు.