మహదేవపూర్ (కాటారం), ఏప్రిల్ 19 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభా ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకున్నది. పనులు చేస్తూ ఓ కార్మికుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూర్ జిల్లా పూడూరు మం డలం కొల్లాపూర్‌కు చెందిన కార్మికుడు గోపాల బాలయ్య (60) శనివారం రాత్రి బహిరంగ సభకు సంబంధించిన పనులు చేస్తుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయాడు. పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కార్మికుడి మృతికి గల కారణాలు తెలియరాకపోవడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కార్మికుడి మృతి విషయాన్ని ప్ర భుత్వ యంత్రాంగం కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయడం, సభా ఏర్పాట్లలో ఓ వృద్ధ కార్మికుడు మృతి చెందితే పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. బాలయ్య కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పలువురు డిమాండ్ చేశారు.