హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 104లో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టులకు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు వారి 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్‌ఈయూ-సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భూపాల్, కే యాదనాయక్ మాట్లాడుతూ 2022లో 104 సేవలు రద్దు చేసి వైద్యారోగ్య శాఖ పరిధిలో వివిధ విభాగాల్లో డ్యూటీలు అప్పగించినట్టు తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టులకు కంటిన్యూవేషన్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో పాటు 7 నెలల జీతాలు చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి సమస్య తీసుకెళ్లి, ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఎంఈ హామీ ఇచ్చినట్టు తెలిపారు.