మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 26 : కల్లు గీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ తాటి చెట్టు పై నుంచిపడి ఓ గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మద్దికుంటలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దికుంటకు చెందిన బండి మునీందర్గౌడ్(51) రోజువారీగా శనివారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కిందపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన మునీందర్గౌడ్ను తోటి గీత కార్మికులు 108 వాహనంలో కరీంనగర్లోని ఓ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మునీందర్గౌడ్కు భార్య, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు.