న్యూఢిల్లీ, ఆగస్టు 4 : భారత దేశంలో 56 శాతం వాహనాలకు బీమా లేదని వెల్లడించిన సుప్రీం కోర్టు, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఇంధనాన్ని నిరాకరించేలా పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. భారత దేశ రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో సగానికి పైగా బీమా లేనివేనని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని నింపడాన్ని నిరాకరించేలా పైలట్ ప్రాజెక్టును రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం దేశంలోని 30.48 కోట్ల వాహనాల్లో 16.54 కోట్ల వాహనాలకు (56 శాతం) బీమా లేదని కోర్టు గమనించింది. ఇంధనం నిరాకరణ ప్రతిపాదనపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు కోర్టు పేర్కొంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ), కేంద్ర రవాణా శాఖ సమన్వయంతో ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని సూచించింది. ఇందుకోసం ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాల సహాయంతో వాహనాల బీమా స్థితిని ఇంధన విక్రయ కేంద్రాల వద్ద తనిఖీ చేసేలా సాంకేతికను అభివృద్ధి చేయాలని కోరింది. దీని వల్ల వాహనదారులు విధిగా బీమా చేయించుకుంటారని ధర్మాసనం అభిప్రాయపడింది.
టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూల సమస్యను పరిష్కరించడానికి కూడా కోర్టు కీలక సూచనలు చేసింది. కొన్ని నిర్దిష్ట కారిడార్లలో వాహనాలను ఆపకుండానే, ఆటోమేటిక్ పద్ధతిలో టోల్ వసూలు చేసేలా పైలట్ ప్రాజెక్టులను అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసే పోలీసులకు ‘వాహన పోర్టల్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డాటాతో అనుసంధానించిన పరికరాలు లేదా యాప్లను అందించాలని పేర్కొంది. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన, అంగవైకల్యం పొందిన కుటుంబాలకు సకాలంలో ఆర్థిక సహాయం అందాలన్నదే ఈ నిబంధన వెనుక ప్రధాన ఉద్దేశమని కోర్టు స్పష్టం చేసింది.