రాజన్న సిరిసిల్ల, మార్చి 8(నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేండ్లుగా సరైన పనిలేక.. మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేయడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. సిరిసిల్లలోని 24వ వార్డు పరిధిలోని జేపీనగర్కు చెందిన నల్ల రామకృష్ణ(52) మరమగ్గాలు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య గతంలోనే అనారోగ్యంతో మృతి చెందింది.
వీరికి ఇద్దరు కొడుకులు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో సరైన పనిలేక రామకృష్ణ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అద్దె ఇంట్లో ఉంటున్న రామకృష్ణకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో నిర్మాణాన్ని ప్రారంభించాడు. అప్పుచేసి స్లాబ్ వరకు పూర్తి చేశాడు. ఇంటి నిర్మాణం కోసం రూ.8 లక్షల వరకు ఓ బ్యాంకులో అప్పు చేశాడు. ఈఎంఐ రూ.15వేల వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. రామకృష్ణకు పనిలేక, ఇంటి నిర్మాణం ముందుకు సాగక, ఈఎంఐలు ఎలా చెల్లించాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లిన రామకృష్ణ చంద్రంపేటలోని ఈదుల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.