హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : తొమ్మిదో తరగతిలో ఉన్నా.. మూడు, ఐదు తరగతుల పాఠాలను చదువలేరు. సమస్యలను ఛేదించలేరు. పాఠశాల విద్యలో అంత దారుణంగా విద్యాప్రమాణాలున్నాయి. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కరువయ్యాయి. దీంతో విద్యార్థుల్లోని సామర్థ్యాలను మెరుగుపరచాలని విద్యాశాఖ నిర్ణయించింది. కొత్తగా 6-10 తరగతుల్లోని విద్యార్థులకు సైతం వర్క్‌బుక్స్(అభ్యాసిక)లను అందజేయాలని నిర్ణయించింది. ఆ తరగతుల్లోని అన్ని సబ్జెక్టులకు ఈ వర్క్‌బుక్స్ ఇస్తారు. ఈ వర్క్‌బుక్స్ తయారీ బాధ్యతలను రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా మండలి(ఎస్సీఈఆర్టీ)కి అప్పగించారు. మొత్తంగా 2026 -27 విద్యాసంవత్సరంలో పాఠ్యపుస్తకాలతోపాటు, ఈ ఐదు తరగతులకు వర్క్‌బుక్స్ కూడా అందజేస్తారు. వీటిని సర్కారు బడుల్లోని విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు.
ప్రైవేట్ బడుల్లోని విద్యార్థులు మాత్రం కొనుక్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1-5 తరగతుల్లోని విద్యార్థులకు మాత్రమే వర్క్‌బుక్స్ ఇస్తున్నారు. 6 -10 తరగతులకు కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే అందజేస్తున్నారు. ఇక నుంచి 1-10 వరకు అన్ని తరగతులకు వర్క్‌బుక్స్ అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు వర్క్బుక్స్లోని అంశాలను కూడా కుస్తీపట్టాల్సిందే. పాఠశాలల్లో విద్యాసంబంధ అంశాలను మార్గదర్శనం చేసేందుకు ఏటా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్నది. ఇంతకాలం పీడీఎఫ్ రూపంలో ఈ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్నారు. వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు.