హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన క్యాడర్ సభ్యత్వాలను డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -సర్) నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదును కూడా పూర్తిస్థాయిలో డిజిటల్ మోడ్‌లోకి మార్చాలని తాజాగా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్‌రావు బుధవారం యాప్ రూపొందించేందుకు ఐటీ సంస్థలు, ఐటీ నిపుణులు, పార్టీ నేతలతో చర్చించారు.
పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారి కోసం బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఒక యాప్‌ను తీసుకురాబోతున్నది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే కార్యకర్తల డాటా సేకరణ అత్యంత సులభమవుతుంది. కేవలం ఫోన్ నంబర్ లేదా కార్యకర్త పేరు టైప్ చేయగానే వారి పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. సభ్యత్వ రుసుము చెల్లింపులో పారదర్శకత కోసం ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ విధానాలను అందుబాటులోకి తీసుకొస్తారు. దీంతో నగదు లావాదేవీల చికులు లేకుండా, నేరుగా పార్టీ ఖాతాలోకి సభ్యత్వ రుసుము జమ అవుతుంది. పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీలక సభ్యత్వానికి రూ.50గా నిర్ణయించారు.
డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ భారీ నెట్వర్ను సిద్ధం చేస్తున్నది. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 35,655 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. బూత్‌కు ఇద్దరు చొప్పున మొత్తం 71,310 మంది కార్యకర్తలను ఎంపిక చేశారు. ఇలా ఒక్కో నియోజకవర్గానికి సుమారు 500 నుంచి 600 మంది అవుతారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే నిఫుణులు జిల్లా పార్టీ కార్యాలయాల్లో మండల కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో వీరికి ఒకరోజు డిజిటల్ సభ్యత్వ నమోదుపై శిక్షణ ఇస్తారు. జిల్లాలవారీగా నియోజకవర్గానికి ఒకరోజు శిక్షణ ఉంటుంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు సభ్యత్వ నమోదు యాప్‌పై పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తారు. బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ)కు వచ్చే అనుమానాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తారు. శిక్షణకు వచ్చేవారికి భోజన వసతి ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. జిల్లా ఇన్‌చార్జ్‌లు ప్రతిరోజూ మండల కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకుంటూ సభ్యత్వ నమోదు వేగాన్ని పర్యవేక్షించాలని నిర్ణయించారు. ‘సర్’ ప్రక్రియలో కొత్త ఓటర్లను కలుపడం, చనిపోయిన వారి పేర్లను ఆన్లైన్ నుంచి తొలగించడం కొంత సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు యాప్ మరింత సరళంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
డిజిటల్ సభ్యత్వ ప్రక్రియపై మంగళవారం ఎర్రవెల్లి నివాసంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దానికి కొనసాగింపుగా బుధవారం హైదరాబాద్‌లో కేటీఆర్, హరీశ్‌రావు డిజిటల్ యాప్ రూపకల్పనపై ప్రముఖ ఐటీ కంపెనీల యాజమాన్యాలు, ఐటీ నిపుణులు, పార్టీ కీలక నేతలతో చర్చించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త డాటాబేస్ పకాగా ఉండాలని, ఎకడా పొరపాట్లకు తావులేకుండా సభ్యత్వ నమోదు ఉండేలా యాప్‌ను రూపొందించాలని సూచించారు. కాలానికి అనుగుణంగా పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుతోపాటు కొత్త తరం ఓటర్లు పార్టీని ఓన్చేసుకొనేలా కసరత్తు చేస్తున్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుంటూనే కొత్తతరాన్ని (జెన్‌జీ) పార్టీ ఆకర్షించేలా చర్యలు చేపట్టబోతున్నారు.
గతం, వర్తమానం గురించి యువతకు వివరిస్తేనే భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని, తెలుస్తుందని భావిస్తున్నారు. తద్వారా యువ సభ్యత్వాన్ని భారీగా పెంచుకోవడంతోపాటు వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కసరత్తు చేస్తున్నారు. మరోవైపు పార్టీ యువ, విద్యార్థి, మహిళా, ఇతర పార్టీ అనుబంధ సంఘాలను కూడా బలోపేతం చేయాలని గులాబీ శ్రేణులు పావులు కదుపుతున్నాయి. వచ్చే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ముందే క్యాడర్‌ను యుద్ధానికి సిద్ధం చేసేలా బీఆర్ఎస్ చేస్తున్న డిజిటల్ కసరత్తు రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. టెక్నాలజీని వాడుకోవడంలో ఎప్పుడూ ముందుండే గులాబీ పార్టీ, ఈ డిజిటల్ సభ్యత్వంతో మరే ఇతర పార్టీకి లేని విధంగా భారీ ‘క్యాడర్ బ్యాంక్’ను సిద్ధం చేసుకుంటున్నది.
దేశంలో ఏ పార్టీకీ లేనివిధంగా పూర్తి డిజిటల్ మోడ్‌లో సభ్యత్వ ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతున్నది. ఈ క్రమంలో దేశంలో ఏయే పార్టీలు డిజిటల్ సభ్యత్వ నమోదు నిర్వహించాయి? వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయా? వాటికన్నా మెరుగైన విధానాలను మనం ఎలా అమలుచేయాలో? అనే అంశాలపై కూడా కసరత్తు చేస్తున్నారు. టీడీపీకి కొంత ఆన్లైన్ విధానంలో సభ్యత్వాలు ఉన్నా, పూర్తిస్థాయిలో డిజిటలైజ్ కాలేదని, తెలంగాణలోనే తొలి డిజిటల్ సభ్యత్వ నమోదు చేపట్టిన పార్టీగా బీఆర్ఎస్ ఉండాలనే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టబోతున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.