హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ‘యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఎన్జీటీ అనుమతులు సాధించలేదు. ఆర్థికభారం పెరిగింది’ ఇవీ ప్రభుత్వ పెద్దల ఆరోపణలు. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి రెండేం డ్లు దాటినా ఈ ప్లాంట్ అందుబాటులోకి రాలేదు. రెండేండ్లలో వైటీపీఎస్ ఆర్థిక భారం రూ.3,236 కోట్లు పెరిగింది. 2023 నాటికి రూ.34, 545 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.37, 781.18 కోట్లకు చేరినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
వైటీపీఎస్‌లో 800 మోగావాట్ల సామర్థ్యం కలిగిన 5 యూనిట్లు ఉన్నాయి. 2,400 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లు ప్రారంభమయ్యాయి. 2025 జూలై 12న యూనిట్-1, 2025 జనవరి 25న యూనిట్-2, ఈ ఏడాది జనవరి 8న యూనిట్-4 కమిషనింగ్ అయ్యాయి. రెండు యూనిట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాది మే నెలలోగా యూనిట్-3ను, జూన్ నాటికి యూనిట్-5ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం గడువుగా నిర్ణయించుకున్నది. ఈ రెండు యూనిట్ల ప్రారంభానికి తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) విధించిన గడువు ముగిసింది.