హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పనుల జాతర కార్యక్రమం మరోసారి ఆరంభ శూరత్వంగా కనిపిస్తున్నది. నిరుడు రూ.4,529 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన 1,25,000 పనుల జాతర లక్ష్యం చేరుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది వ్యయాన్ని సగానికి తగ్గించి రూ.2,198.83 కోట్లకు కుదించారు. తద్వారా ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కార్యక్రమం గత ఏడాది లక్ష్యాలను చేరుకోలేకపోవడంతో గ్రామీణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అయినా, రేవంత్రెడ్డి సర్కారు మళ్లీ ఈ ఏడాది ఆగస్టు 22న పనుల జాతర-2025 కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్, గ్రామీణ మంచినీటి సరఫరా వంటి అనేక పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 1,01,589 కొత్త పనులు చేపట్టాలని నిర్దేశించారు. ఈ పనులన్నీ మార్చి 2026 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, గత అనుభవాలను బట్టి ఈ లక్ష్యాలు నెరవేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కలలుగానే పనుల జాతర లక్ష్యాలు
పశువుల కొట్టాల నిర్మాణం, గొర్రెలు, కోళ్ల షెడ్ల నిర్మాణం, మట్టి రోడ్లు వంటి పనులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, మౌలిక వసతులను మెరుగుపరుస్తాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ఈ పనులు నామమాత్రంగానే జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ‘ప్రతి ఏడాది కొత్త హామీలతో జాతర ప్రారంభిస్తారు. కానీ గత లక్ష్యాలు పూర్తి చేయకుండానే మరో జాతరకు తెరతీస్తారు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టే ఉపాయం మాత్రమే’ అని ఓ గ్రామ నాయకుడు వాపోయారు. మార్చి 2026 నాటికి పనులను పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తునప్పటికీ వైఫల్యాలు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు.