సిద్దిపేట, మార్చి 6 : సీఎం కేసీఆర్ ఆడపడుచుల ఆత్మబంధువు.. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు.. మూడు రోజుల పాటు నిర్వహించనున్న సంబురాల్లో పాల్గొన్నారు.
అందులో భాగంగా తొలి రోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, సిద్దిపేటలో మహిళల అభివృద్ధికి అమలవుతున్న పథకాలను చీరెలపై వేసి సంబురాలు జరుపుకున్నారు.
మహిళా విభాగం ఆధ్వర్యంలో థ్యాంక్స్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు అంటూ కృతజ్ఞతలు తెలుపుతూ ముగ్గుల పోటీలు నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ అనే అక్షరాల ఆకారంలో చీరెలపై వేసి కట్టుకొని మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మా సారధి మీరు.. మా ఆడపడుచుల ఆత్మబంధువు మీరంటూ సిద్దిపేట మహిళలు గొప్ప చైతన్యాన్ని చాటారు. సంక్షేమ పథకాలైన కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, షీటీమ్స్, మహిళా సంరక్షణ కోసం సఖి సెంటర్లు, మహిళా పోలీసు స్టేషన్, భరోసా సెంటర్, మహిళా ప్రాంగణం, మహిళా డిగ్రీ కళాశాల, మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చీరెల పై పెయింటింగ్ వేసి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు పయ్యావుల పూర్ణిమ, వంగ రేణుక, కొండం కవిత, ఉదర జయ, బందారం శ్రీలత, అడ్డకట్ల కావేరి, ముత్యాల శ్రీదేవి, కాటం శోభరాణి, దాసరి భాగ్యలక్ష్మి, ఆలకుంట కవిత, సీనియర్ మహిళా నాయకురాలు బూర విజయ, టైగర్ నర్సమ్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.