కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 15 : ‘మీ చుట్టూ ఇంకెన్నాళ్లు తిప్పుకుంటరు.. ఏదో ఒకటి తేల్చండి.. లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదు’ అంటూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ మహిళ బైఠాయించింది. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల తీరుపై శాపనార్థాలు పెట్టగా, ఆమెను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి బయట వదిలిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లికి చెందిన పిల్లి భారతి కుటుంబానికి గ్రామంలో మూడెకరాలు ఉండగా, ఊరి చెరువు వెడల్పులో ఆ భూమి అందులో కలిసింది.
దీంతో ఉన్నతాధికారులను కలిసి వేడుకోవడంతో నగరంలోని హస్నాపూర్కాలనీలో మూడు గుంటల ఇంటి స్థలంతోపాటు భారతికి కలెక్టరేట్లో ఉద్యోగం కల్పిస్తూ, అప్పటి అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అధికారులు ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకోగా, నెల రోజులపాటు మాత్రమే ఉద్యోగం చేసి, అనంతరం అనారోగ్య కారణాలతో మానేసింది. తన కొడుకు ఎదిగిరావడంతో అతడికి తన ఉద్యోగం ఇప్పించాలని కొన్ని నెలల క్రితం కలెక్టర్‌ను కోరింది.
నీటిపారుదల శాఖలో అవకాశం కల్పించాలంటూ కలెక్టర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. మరోవైపు తనకిచ్చిన ఇంటి స్థలంలో కట్టుకున్న ఇల్లు కూల్చివేస్తామంటూ అధికారులు నోటీసులిచ్చారని సోమవారం ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేసింది. విచారిస్తానంటూ కలెక్టర్ చెప్పగా , తాను నెలల తరబడి తిరుగుతున్నానని, సీఎంకు కూడా ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని వాపోయింది.