శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 21:12:01

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం : సీఎం కేసీఆర్‌

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తోందని.. పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణతో పాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్‌ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, అటవీశాఖ ముఖ్యకార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన ఒకటన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడా గుడుంబా తయారీ జరుగుతున్నట్లు సమాచారముంది. గుడుంబా తయారీని తక్షణమే అరికట్టాలన్నారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజ్‌, సివిల్‌ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సీఎం సూచించారు.

ఫారెస్టు స్మగ్లింగ్‌ నిర్మూలనలో సివిల్‌ పోలీస్‌ భాగస్వామ్యం కావాలి..

సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను అరికట్టాలని సీఎం అన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. గత పాలకులు కలప స్మగ్లింగ్‌ను పట్టించుకోకపోవడంతో కొందరికి అలుసుగా మారిందన్నారు. కలప స్మగ్లింగ్‌ను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. ఫారెస్టు స్మగ్లింగ్‌ను అరికట్టంలో అటవీశాఖ అధికారులే కాకుండా సివిల్‌ పోలీస్‌ వ్యవస్థ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు అడవుల పట్ల అవగాహన పెంచుకుని స్మగ్లింగ్‌ వంటి అటవీ నేరాలను అరికట్టాలన్నారు. అటవీశాఖ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఎప్పటికప్పుడు ఇరుశాఖల ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించుకుని కలప స్మగ్లింగ్‌ నివారణ చర్యల రూపకల్పనకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. 

బలవంతుల దాడులు జరగకుండా చూడాలి... 

బలహీనుల మీద బలవంతుల దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీస్‌ వ్యవస్థకు ఉందని సీఎం అన్నారు. సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమన్నారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలన్నారు. దళితులపై దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నతాధికారుల దగ్గర నుంచి కిందిస్థాయి పోలీస్‌ వరకు సమాజంలో ఒకరిగా భాగస్వాములు కావాలన్నారు. పౌరులందరికీ గౌరవాన్నిస్తూ ఫ్రెండ్లీ పోలీస్‌ స్ఫూర్తిని పెంచుకోవాల్సిందిగా సూచించారు. రక్షణ కోసం వచ్చిన అభాగ్యుల పట్ల మానవీయ కోణంలో మెలగాలని సీఎం పేర్కొన్నారు.

కారుణ్య నియామకాలను చేపట్టాలి.. 

పోలీస్‌శాఖలో కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదని సీఎం అన్నారు. విధుల్లో ఉంటూ చనిపోయిన ఉద్యోగి వారసులకు కారుణ్య నియామకం ప్రకారం తక్షణమే ఉద్యోగం ఇవ్వాలన్నారు. దీనిపై తక్షణ కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇతర శాఖల్లో ఖాళీలుంటే పరిశీలించి వెయిటింగ్‌ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు అందేలా చూడాలని డీజీపీని ఆదేశించారు. 

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై దృష్టి సారించాలి... 

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాలపై పోలీస్‌ ఉన్నతాధికారులు దృష్టి సారించి అరికట్టాలన్నారు. కష్టపడి సాధించాల్సిన పట్టాలను తప్పుడు దారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుందన్నారు. ఫేక్‌ సర్టిఫెకెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్‌శాఖలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్‌ సెటిల్‌ చేసి సర్వీసు ఆఖరి రోజున గౌరవ ప్రదంగా ఇంటి వరకు సాగనంపాలన్నారు. తన జీవితకాలం పాటు డిపార్ట్‌మెంట్‌కు సేవలందించిన ఉద్యోగి రిటైర్మెంట్‌ అయితే వారిని సత్కరించి కారులో ఇంటి వరకు దించే సంప్రదాయాన్ని కొనసాగించాలని తెలిపారు. 

అతి త్వరలోనే వినియోగంలోకి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌‌.. 

పోలీస్‌ వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలో సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలని సీఎం అన్నారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్‌లో నిర్మితమౌతున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను త్వరలో నిర్మించి వినియోగంలోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణను వేగవంతం చేయాలన్నారు. పోలీస్‌శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం మరింతగా కృషి జరగాల్సిన అవసరముందని సీఎం అన్నారు. పోలీస్‌ ఉద్యోగ నియామకాల్లో మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్లను అమలు పరుస్తున్న నేపథ్యంలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందన్నారు. మహిళలు పనిచేసే పోలీస్‌ కార్యాలయాల స్థలాల్లో రెస్ట్‌రూంలు, ఇతర వసతులు కల్పించాలని సీఎం పేర్కొన్నారు.