మాడ్గుల, ఫిబ్రవరి 12 : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవికి చేదుఅనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని అందుగుల, ఇర్విన్, మాడ్గుల, కొల్కులపల్లి గ్రామాల్లో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వారు వచ్చారు. అందుగులలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసే సందర్భంలో ‘మీరు వాగుపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు.. ఏమైంది సారు’ అంటూ మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు.
రైతుబంధు ఇస్త్తలేరు, రూ.2500 ఇస్తలేరు, రుణమాఫీ కాలేదు, ఎందుకు వచ్చారు?’ అంటూ నిలదీశారు. పోలీసుల సహాయంతో అక్కడి నుంచి ఇర్విన్ గ్రామానికి చేరుకున్నారు. ఇర్విన్ గ్రామంలో 3.20 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ ప్రజలు ఎంపీని, ఎమ్మెల్యేను అడ్డుకొని ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ, ఇర్విన్ రిజర్వాయర్ను రద్దు చేయాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.